వేములవాడ తెరాస శాసనసభ్యుడు చెన్నమనేని రమేష్ తన భారతీయ పౌరసత్వం కోసం మళ్ళీ న్యాయపోరాటం మొదలుపెట్టారు. తన భారతీయ పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్రహోంశాఖ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆయన శుక్రవారం హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
భారత పౌరసత్వ చట్టం ప్రకారం పౌరసత్వం లభించిన 30రోజులలోగా ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తేనే పరిశీలించాలని కానీ 2014 ఎన్నికలలో తన చేతిలో ఓడిపోయిన భాజపా నేత ఆది శ్రీనివాస్ ఆ దుగ్ధతోనే తరువాత ఎప్పుడో తన పౌరసత్వంపై అభ్యంతరం చెపుతూ కేసు వేస్తే దానిపై హోంశాఖ ఇటువంటి నిర్ణయం తీసుకోవడం చట్టప్రకారం సరికాదని రమేష్ తన పిటిషన్ లో పేర్కొన్నారు.
ఈ వ్యవహారంలో చట్టంలో ఉన్న ఆ 30 రోజుల నిబందనతో రమేష్ తిరిగి తన పౌరసత్వం పొందగలనని ఆశించడం అత్యసే అవుతుంది. ఒకవేళ హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వులతో హైకోర్టు ఏకీభవిస్తే మళ్ళీ అయన సుప్రీంకోర్టుకే వెళ్ళవలసి ఉంటుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే కేంద్ర హోంశాఖ దర్యాప్తు జరిపి ఈ ఉత్తర్వులు జారీ చేసింది. కనుక సుప్రీంకోర్టులో కూడా రమేష్ కు వ్యతిరేకంగానే తీర్పు వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే ఆయన ఏమి చేస్తారో చూడాలి.