పాదయాత్రకే ఇంత డైలేమా?

నూతిలో ఒక కప్ప పైకి వెళ్ళేందుకు ప్రయత్నిస్తే మిగిలిన కప్పలన్నీ దాని కాళ్ళు పట్టుకొని క్రిందకు లాగినట్లు రాష్ట్ర కాంగ్రెస్ నేతలెవరైనా పార్టీని బలోపేతం చేసేందుకు పాదయాత్రలు, బహిరంగ సభలు నిర్వహించడానికి చొరవ చూపితే మిగిలిన వారందరూ అతనిని వెనక్కు లాగుతుంటారు. ఎవరి భయాలు, అనుమానాలు, అభ్యంతరాలు వారికుంటాయి. కానీ పైకి మాత్రం పార్టీ క్రమశిక్షణ, వ్యూహాలు అంటూ ఏవో చెపుతుంటారు.

హైదరాబాద్ గాంధీ భవన్ కార్యాలయంలో ఈరోజు పిసిసి ఆఫీస్ బేరర్ల సమావేశం జరిగింది. దానిలో పార్టీ సీనియర్ నేతలందరూ పాల్గొన్నారు. రాష్ట్రంలో బడుగు బలహీనవర్గాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క పాదయాత్ర చేయాలనుకొన్నారు. పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి కూడా ‘రాహుల్ సందేశ్’ పేరుతో పాదయాత్ర చేయాలనుకొంటున్నారు. కనుక వారిద్దరిలో ఎవరు పాదయాత్ర చేయాలనే విషయంపై ఈ సమావేశంలో అందరూ తర్జన భర్జనలు పడిన తరువాత భట్టి విక్రమర్క చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది.

ఈలోగా నేరెళ్ళ ఘటనను నిరసిస్తూ వేములవాడలో నిరవధిక దీక్షలు చేపట్టాలని నిర్ణయించారు. దానిలో రోజుకొక సీనియర్ నేత పాల్గొనాలని నిర్ణయించారు. మళ్ళీ ఈ పాదయాత్ర, దీక్షలపై మరోసారి లోతుగా చర్చించి నాలుగైదు రోజులలో తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు.

వచ్చే ఎన్నికలలో తెరాసను ఓడించి తామే అధికారంలో రాబోతున్నామని కాంగ్రెస్ నేతలు పదేపదే చెపుతుంటారు. కానీ పాదయాత్ర చేపట్టడానికే పార్టీ నేతలలో ఇంత డైలామా ఉంటే రేపు ఎన్నికల కురుక్షేత్రంలో తెరాసను ఏవిధంగా డ్డీ కొంటారు?