చంద్రబాబు సంచలన ప్రకటన

ఏపి సిఎం చంద్రబాబు నాయుడు ఈరోజు ఒక సంచలన ప్రకటన చేశారు. ఈరోజు కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాలలో పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఆయన ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ మరొక రెండు మూడు రోజులలో నిరుద్యోగ భృతి, డ్వాక్రా రుణాల మాఫీ, మూడో విడత పంట రుణాల మాఫీపై ప్రకటన వెలువడుతుందని చెప్పారు.  

డ్వాక్రా, పంటరుణాల విడుదల కొత్త విషయమేమీ కాదు కానీ నిరుద్యోగ భృతి హామీ అమలు గురించి ఆయన మాట్లాడటం ఇదే మొదటిసారి. 2014 ఎన్నికల ప్రచారంలో రాష్ట్రంలో నిరుద్యోగులకు నెలకు రూ.2,000 చొప్పున ఉద్యోగం వచ్చేంత వరకు పెన్షన్ ఇస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్ళు గడిచిపోయినా ఇంతవరకు ఆ ఊసు ఎత్తలేదు. ఇటీవల నంద్యాల, కాకినాడ ఎన్నికలలో వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి దాని గురించి గట్టిగా నిలదీసిన తరువాత ప్రభుత్వంలో కదలిక వచ్చినట్లుంది. పైగా 2019లో జరుగవలసిన సార్వత్రిక ఎన్నికలు ఆరు నెలలు ముందుగా జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. కనుక ఇక నిరుద్యోగ భృతి హామీని కూడా అమలుచేయడానికి ఏపి సర్కార్ సిద్దం అవుతున్నట్లుంది. తెలంగాణాలో తెరాస అధికారంలోకి వచ్చినట్లయితే లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు ఆ హామీ నెరవేరలేదు. కనుక ఆర్ధికసమస్యలలో ఉన్న ఏపి సర్కార్ ఒకవేళ నిరుద్యోగభృతి ఇచ్చినట్లయితే, ధనిక రాష్ట్రమైన  తెలంగాణాలో కూడా ఇవ్వాలని నిరుద్యోగులు డిమాండ్ చేసినా ఆశ్చర్యం లేదు.