రాజా సదారాంకు వీడ్కోలు

తెలంగాణా శాసనసభ కార్యదర్శి రాజా సదారాం పదవీ విరమణ సందర్భంగా ఆయన గౌరవార్ధం శుక్రవారం వీడ్కోలు సభ జరిగింది. దానిలో స్పీకర్ మధుసూధనాచారి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ స్వామీ గౌడ్, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి హరీష్ రావు, కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన అధికార ప్రతిపక్ష సభ్యులు అందరూ ఇతర రాష్ట్ర శాసనసభలతో పోలిస్తే తెలంగాణా శాసనసభ గత మూడేళ్ళుగా చాలా ప్రశాంతంగా సాగుతోందని, సభలో ప్రజా సమస్యలపై అర్ధవంతమైన చర్చలు జరుగుతున్నాయని ఆ క్రెడిట్ రాజా సదారాంకే దక్కుతుందని చెప్పడం విశేషం. ఆయన అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలను చాలా చక్కగా సమనవ్యపరుచుకొంటూ సభా కార్యక్రమాలు సజావుగా జరిగేందుకు చాలా తోడ్పడ్డారని సి.ఎల్.పి.నేత కె జానారెడ్డి ప్రశంశించారు. షబ్బీర్ అలీ కూడా ఇంచుమించు అటువంటి అభిప్రాయమే వ్యక్తం చేశారు. శాసనసభ చక్కగా నడిపిస్తున్నారని ప్రతిపక్ష నేతలు చెప్పినందుకు మంత్రి హరీష్ రావు కృతజ్ఞత తెలిపారు.