బైసన్ పోలో గ్రౌండ్స్ లో కొత్త సచివాలయ నిర్మాణం ప్రతిపాదనపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు, అభ్యంతరాలకు తెరాస నేతలు గట్టిగానే సమాధానాలు చెపుతున్నారు. తెరాస ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ నిన్న హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో దూరదృష్టితో ఆలోచించి రాష్ట్రానికి మేలు కలిగే పనులు చేస్తుంటే, ప్రతిపక్షాలు గుడ్డిగా వ్యతిరేకిస్తూ విమర్శలు గుప్పిస్తున్నాయి. సుదీర్గకాలం పాటు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్, తెదేపా ప్రభుత్వాలు ఏనాడూ రక్షణశాఖ అధీనంలో ఉన్న భూములను తీసుకొని వాటిని ఈవిధంగా రాష్ట్రావసరాలకు వినియోగించుకోవచ్చని ఆలోచన కూడా చేయలేదు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా దూరదృష్టితో ఆలోచించి కేంద్రాన్ని ఒప్పించి ఆ భూములు సంపాదించి దానిలో తెలంగాణా రాష్ట్ర ప్రతిష్టలు ఇనుమడించే విధంగా కొత్త సచివాలయం కడతానంటే ప్రతిపక్ష నేతలు అందుకు ఆయనను అభినందించకపోగా నోటికివచ్చినట్లు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్, తెదేపా, వామపక్షాలు తమ ఉనికిని చాటుకొని కాపాడుకోవడం కోసమే ఇటువంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారు.
నిజానికి కొత్త సచివాలయం నిర్మాణం వలన రాష్ట్ర ప్రభుత్వానికి చాలా భారం తగ్గుతుంది. సచివాలయానికి సంబంధించిన అనేక ప్రభుత్వ కార్యాలయాలు నేటికీ అద్దె భవనాలలోనే కొనసాగుతున్నాయి. ఆ కారణంగా నేటికీ అధికారులు సమావేశాలు హోటల్స్ లేదా ఫంక్షన్ హాల్స్ లో నిర్వహించుకోవలసిన దుస్థితి నెలకొని ఉంది. వాటికోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా సుమారు రూ.25 కోట్లు వరకు ఖర్చు చేస్తోంది. కొత్త సచివాలయ నిర్మాణానికి సుమారు రూ.250 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. అంటే పదేళ్ళపాటు అద్దెల కోసం ఖర్చు చేస్తున్న సొమ్ము తోనే సచివాలయం నిర్మిస్తున్నట్లు అవుతుంది కనుక ఆమేరకు ప్రభుత్వం ఆర్దికభారం తగ్గుతుంది.
ముఖ్యమంత్రి కార్యాలయంతో సహా మంత్రులు, వివిదశాఖల అధికారులు. వారి కార్యాలయాలు అన్నీ కొత్త సచివాలయంలోనే ఉంటాయి కనుక ఆమేరకు రవాణా ఖర్చులు మిగులుతాయి. పనులు కూడా వేగవంతం అవుతాయి. ఈ విషయాలన్నీ ప్రతిపక్షాలకు కూడా తెలుసు అయినా వాటికీ అవసరం లేదు. కనుక మేము కూడా వాటిని పట్టించుకోనవసరం లేదు. ప్రతిపక్షాలు ఎన్ని అవరోధాలు సృష్టించినా మేము బైసన్ పోలో గ్రౌండ్స్ లో కొత్త సచివాలయం నిర్మించి తీరుతాము. దానిని ఎవరూ ఆపలేరు,” అని కర్నే ప్రభాకర్ అన్నారు.