సికింద్రాబాద్ బైసన్ పోలో గ్రౌండ్స్ లో కొత్త సచివాలయం నిర్మాణంపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేసిన అభ్యంతరాలకు, విమర్శలకు రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఘాటుగా స్పందించారు. ముందుగా తమ ప్రభుత్వం కొత్త సచివాలయం ఎందుకు నిర్మించాలనుకొంటోందో కారణాలను విలేఖరులకు వివరించారు.
1. ఒకే మంత్రిత్వశాఖకు చెందిన వివిద కార్యాలయాలు నగరంలో వేర్వేరు ప్రాంతాలలో ఉండటం వలన వాటి మద్య ఫైళ్ళు కదలడం, అధికారులు సమావేశం కావడం చాలా కష్టం అవుతోంది. కనుక అన్ని శాఖల మంత్రులు, ప్రధాన కార్యాలయాలు, అధికారుల కార్యాలయాలు ఒకేచోట ఉన్నట్లయితే పనులు వేగంగా సాగే అవకాశం ఉంది.
2. నేటికీ కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాలలోనే కొనసాగుతున్నాయి. వాటి అద్దెలకే ఏటా వందల కోట్లు ఖర్చు చేయవలసి వస్తోంది. అలాగే అధికారిక సమావేశాలు, కలెక్టర్ల సమావేశాలకు ప్రస్తుత సచివాలయంలో తగినంత స్థలం లేనందున హోటల్స్ లో లేదా ఫంక్షన్ హాల్స్ లో నిర్వహించుకోవలసివస్తోంది. కొత్త సచివాలయం నిర్మించుకోవడానికి మొదట్లో ఒకసారి కొంత ఖర్చు అయినా ఆ తరువాత ఆ అద్దెలపై పెడుతున్న ఆ ఖర్చులన్నీ మిగులుతాయి.
“ఇటువంటివే ఇంకా సమస్యలను, ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మేము సచివాలయం నిర్మించబోతుంటే కాంగ్రెస్ నేతలు దానికి కూడా అడ్డుపడటం సిగ్గుచేటు. వారు కాళేశ్వరం ప్రాజెక్టుపైనే ఏకంగా 96 కేసులు వేశారు. అయినా అడ్డుకోలేకపోయారు. ఇదీ అంతే. కాంగ్రెస్ నేతలు తమ ఉనికిని చాటుకోవడానికే ఇటువంటి దురాలోచనలు, కుట్రలు చేస్తున్నారు. అయితే వారు ఎన్ని అవరోధాలు సృష్టించినా మేము వాటన్నిటినీ ఎదుర్కొని ముందుకే సాగుతున్నాము. తెలంగాణా రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తూనే ఉన్నాము,” అని అన్నారు మంత్రి తుమ్మల.