సికింద్రాబాద్ బైసన్ పోలో గ్రౌండ్స్ లో కొత్త సచివాలయ భవనం నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. ఆ ప్రాంతాన్ని వారు నిన్న పరిశీలించిన తరువాత కొంతసేపు అక్కడ ధర్నా చేసి నినాదాలు చేశారు.
ఆ సందర్భంగా శాసనమండలిలో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ విలేఖరులతో మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలన్నీ ఆయన రాజరికపు పోకడలకు అద్దం పట్టేవిగా ఉన్నాయి. ప్రజాధనం వృధా చేసి విలాసవంతమైన రాజభవనం వంటి ప్రగతి భవన్ కట్టుకొన్న ఆయన ఇప్పుడు తన కోసం ఇంకా విలాసవంతమైన సచివాలయం నిర్మించుకోవడానికి సిద్దపడుతున్నారు. వాస్తుదోషాల పేరుతో పాత భవనాలను కూల్చివేసుకొంటూ తన ఇష్టం వచ్చినట్లు ప్రజాధనం ఖర్చు చేసి విలాసవంతమైన భవనాలను నిర్మించుకొంటున్నారు. ఇది రాజరిక పోకడలు కాకపోతే మరేమిటి? ప్రగతి భవన్ లోనే ఆయన అధికారులతో, మంత్రులతో సమావేశాలు నిర్వహిస్తున్నప్పుడు మళ్ళీ కొత్త సచివాలయం నిర్మించవలసిన అవసరం ఏమిటి? ఇప్పటికే రూ.73,000 కోట్లు అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. ఇంకా ఎన్ని అప్పులు చేస్తారు? కొత్త సచివాలయం నిర్మాణం ప్రతిపాదనను విరమించుకోకపోతే గట్టిగా ప్రతిఘటిస్తాము,” అని హెచ్చరించారు.
సి.ఎల్.పి.నేత కె జానారెడ్డి మాట్లాడుతూ, “ఒకపక్క ప్రభుత్వ, ప్రజావసరాలకు నగరంలో భూమి దొరకక చాలా ఇబ్బందిపడుతుంటే, నగరం నడిబొడ్డున లభించిన ఈ భూమిలో ఆర్భాటంగా కట్టడాలు నిర్మించడం సరికాదు. బైసన్ పోలో గ్రౌండ్స్ ను ప్రజావసరాలకు వినియోగిస్తే మాకేమీ అభ్యంతరం లేదు కానీ కొత్త సచివాలయం నిర్మించాలనే ప్రతిపాదనను నేను కూడా వ్యతిరేకిస్తున్నాను,” అని అన్నారు.
వి హనుమంతరావు విలేఖరులతో మాట్లాడుతూ, “ ప్రస్తుతం వినియోగిస్తున్న సచివాలయంలో అనేక బ్లాకులు నిర్మించి కనీసం 10 ఏళ్ళు కూడా కాలేదు. అన్నీ దృడంగా చక్కగా వియోగానికి అనుకూలంగా ఉన్నాయి. అసలు సచివాలయానికే రాని ముఖ్యమంత్రి కేసీఆర్ కు కొత్త సచివాలయం ఎందుకు?ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని తరలించడాన్ని, ప్రజాధనం వృధా చేసి కొత్త సచివాలయం నిర్మాణాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. మా హెచ్చరికలను పట్టించుకోకపోతే ప్రభుత్వంతో పోరాడటానికి వెనుకాడము,” అని హెచ్చరించారు.