అప్పుడే కాంగ్రెస్ అభ్యంతరాలు షురూ

సికింద్రాబాద్ బైసన్ పోలో గ్రౌండ్స్ లో నూతన సచివాలయం నిర్మించబోతున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన చేసిన కొన్ని గంటలలోపే రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి, సీనియర్ నేతలు వి హనుమంతరావు, జానారెడ్డి, షబ్బీర్ అలీ తదితరులు ఆ ప్రాంతానికి వెళ్ళి పరిశీలించి అభ్యంతరం తెలిపారు. 

ఉత్తం కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “అసలు ఎన్నడూ సచివాలయానికే రాని కేసీఆర్ కు మళ్ళీ కొత్త సచివాలయం ఎందుకు?ప్రస్తుతం ఉన్న సచివాలయంలో నుంచే అనేకమంది ముఖ్యమంత్రులు, మంత్రులు సమైక్యరాష్ట్రాన్ని పాలించారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు అది పనికిరాదట! దానిలో నుంచి ఏపి సర్కార్ తన ఉద్యోగులను, కార్యాలయాలను వెలగపూడికి తరలించుకుపోవడంతో, ఇప్పుడు ఇంకా అనేక బ్లాకులు తెరాస సర్కార్ కు అందుబాటులోకి వచ్చాయి. ఒకప్పుడు సమైక్య రాష్ట్రాన్ని పాలించడానికి సరిపోయిన ప్రస్తుత సచివాలయం నుంచి ఇప్పుడు తెలంగాణా రాష్ట్ర పాలనకు సరిపోదా? నగరం నడిబొడ్డున ఉన్న అది ప్రజలకు, మంత్రులకు, అధికారులకు అందరికీ అందుబాటులో ఉంది. దానిని వినియోగించుకోకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ విలువైన ప్రజాధనం ఖర్చు చేసి విలాసవంతమైన భవనాలు కట్టాలనుకోవడం సరికాదు. నగరంలో ఎక్కడ ఖాళీ ప్రాంతాలు కనబడితే అకక్డ బారీ భవనాలనతో నింపేయలనుకోవడంసరికాదు. ఒకప్పుడు మహమ్మద్ బీన్ తుగ్లక్ దేశ రాజధానిని డిల్లీకి మళ్ళీ దౌలతాబాద్ కు మళ్ళీ డిల్లీకి మార్చినట్లే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వ్యవహరిస్తున్నారు. రక్షణ శాఖ ఇచ్చిన భూములను తీసుకోవడాన్ని మేము స్వాగతిస్తున్నాము. అక్కడ ప్రజలకు ఉపయోగపడేది ఏదైనా చేస్తే మేము అంగీకరిస్తాము కానీ ప్రజాధనం వృధా చేసి కొత్త సచివాలయం నిర్మిస్తామంటే చూస్తూ ఊరుకోము. ప్రజలతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసి దానిని అడ్డుకొంటాము,” అని హెచ్చరించారు.