సికింద్రాబాద్ లోని బైసన్ పోలో గ్రౌండ్స్ ను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించడానికి రక్షణశాఖ అంగీకరించడంతో అక్కడ నూతన సచివాలయ నిర్మాణం కోసం ప్రభుత్వం కసరత్తు ప్రారంబించింది. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు దానికి సంబంధించి కొన్ని వివరాలను మీడియాకు తెలియజేశారు.
సుమారు 6-7లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు అంతస్తులలో నూతన సచివాలయం నిర్మించబడుతుంది. దానిలో ప అంతస్తులో ముఖ్యమంత్రి కార్యాలయం, అన్నిశాఖల ప్రధాన కార్యదర్శుల కార్యాలయాలు ఉంటాయి. సచివాలయంలో 32 శాఖలకు 3 లక్షల చదరపు అడుగులు, కమీషనరేట్స్, డైరెక్టరేట్స్,శాఖాధిపతుల కార్యాలయాల కోసం 4 లక్షల చదరపు అడుగులు కేటాయించబడతాయి. వాటిలో అత్యాధునికమైన సౌకర్యాలు, పరికరాలు ఏర్పాటు చేయబడతాయి. సచివాలయాన్ని ఆనుకొని విశాలమైన కార్ పార్కింగ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ విశాలమైన రోడ్లు నిర్మించబడతాయిసచివాలయం వద్ద ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేందుకు దాని చుట్టూ చెట్లు, అందమైన పూల మొక్కలతో కూడిన తోటలు ఏర్పాటు చేయబడతాయి. సచివాలయానికి ఆనుకొనే 20 ఎకరాలలో పెరేడ్ గ్రౌండ్ కూడా ఉంటుంది. దానిలోనే రాష్ట్రావతరణ దినోత్సవం, గణతంత్ర దినం, స్వాతంత్ర్య దినోత్సవం, బతుకమ్మ పండుగ వేడుకలు నిర్వహించబడతాయి.
తెలంగాణా సంస్క్రతి సంప్రదాయాలు ఉట్టిపడేవిధంగా సచివాలయం డిజైన్ రూపొందించబడుతోంది. ఇది అమెరికాలో ఇల్లినాయ్ రాష్ట్రంలోని షికాగో ఫెడరల్ భవనాన్ని పోలి ఉండవచ్చని సమాచారం. ముంబైకు చెందిన హఫీజ్ కాంట్రాక్టర్ అనే ఆర్కిటెక్ట్ సంస్థ ఈ భవనం డిజైనును సిద్దం చేస్తోంది. ఈ నవంబరు నెలలో హైదరాబాద్ లో జరుగబోయే అంతర్జాతీయ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సుకు హాజరవనున్నారు. అప్పుడే ఆయన చేత దీనికి శంఖుస్థాపన చేయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. శంఖుస్థాపన జరిగిన వెంటనే నిర్మాణపనులు మొదలుపెట్టి 2020 నాటికి దీనిని పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.