రైతులు అప్పులు చేసి మరీ నీళ్ళ కోసం వరుసగా అనేక బోరుబావులు త్రవ్వించడం, వాటిలో నీళ్ళు పడకపోతే నిరాశానిస్పృహలతో ఆత్మహత్యలు చేసుకొంటున్నట్లు నిత్యం వార్తలు వింటూనే ఉన్నాము. వారు త్రవ్వి వదిలేసిన ఆ బోరు బావులలో చిన్నారులు పడి చనిపోతున్న ఘటనలను కూడా చూస్తూనే ఉన్నాము. అయినప్పటికీ ఇంతవరకు ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఎవరూ పూనుకోలేదు. బోరుబావిలో పిల్లలు పడిపోయినప్పుడు అధికార పార్టీ నేతలు, మంత్రులు, అధికారులు, మీడియా చాలా హడావుడి చేసి చేతులు దులుపుకోవడం, మళ్ళీ మరో ప్రమాదం జరిగినప్పుడు మళ్ళీ అందరూ హడావుడి చేయడం ఒక దురలవాటుగా మారిపోయింది.
రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బోరుబావి ప్రమాదానికి కారకులైన ఇద్దరికి శిక్షలు పడ్డాయి. సంగారెడ్డి జిల్లాలో పుల్కల్ మండలంలోని బొమ్మారెడ్డిగూడెంకు చెందిన బైరు సాయిలు, మొగులమ్మ దంపతుల మూడేళ్ళ కుమారుడు బైరు రాకేశ్ 2015 నవంబర్ 28న బోరుబావిలో పడి మరణించాడు.
ఈ కేసును విచారించిన మెదక్ సబ్ కోర్టు న్యాయమూర్తి వాణి ఆ బోరుబావి యజమాని కుమ్మారి రాములు, బోరుబావి త్రవ్విన రిగ్గు యజమాని వెంకటేష్ లకు చెరో ఐదేళ్ళు జైలు శిక్ష, చెరో పదివేలు జరిమానా విధించారు. బోరుబావిని త్రవ్విన తరువాత దానిపై మూత బిగించకుండా వారిరువురూ నిర్లక్ష్యంగా వ్యవహరించినందునే చిన్నారి రాకేశ్ దానిలో పడి చనిపోయాడని కనుక అందుకు బాధ్యులైన వారిరువురూ శిక్షార్హులని న్యాయమూర్తి అన్నారు.
ఈ తీర్పును రాష్ట్రంలో బోరుబావులు త్రవ్వి వాటికి మూతలు బిగించకుండా విడిచిపెట్టిన రైతులు, ఆ బోరుబావులను త్రవ్విన రిగ్గు యజమానులు ఒక హెచ్చరికగా భావించి తెరిచి వదిలేసిన బోరుబావులన్నిటికీ మూతలు బిగించడమో లేక పూడ్చి వేయడమో చేస్తే మంచిది.