వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలం సీజన్లులాగే రైళ్ళు పట్టాలు తప్పే సీజన్ కూడా ఒకటున్నట్లుంది. గత నెల రోజుల వ్యవధిలో వరుసగా 4 రైళ్ళు పట్టాలు తప్పగా ఈరోజు మరో రైలు పట్టాలు తప్పింది. ఈసారి కూడా ఉత్తరప్రదేశ్ లోనే ఈ ప్రమాదం జరుగడం విచిత్రమే.
హౌరా నుంచి జబల్ పూర్ వెళుతున్న శక్తిపుంజ్ ఎక్స్ ప్రెస్ (ట్రైన్ నెంబర్:11448) యూపిలో సోన్ భద్ర జిల్లాలో ఓబరా అనే ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున పట్టాలు తప్పింది. మొత్తం ఏడు బోగీలు పట్టాలు తప్పాయి. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరూ చనిపోలేదు. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియవలసి ఉంది.
ఇటీవల వరుస రైలు ప్రమాదాలు జరుగడంతో వాటికి నైతిక బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి సురేష్ ప్రభు, రైల్వే బోర్డు చైర్మన్ ఎకె మిట్టల్ తమ పదవులకు రాజీనామాలు చేశారు. సురేష్ ప్రభు స్థానంలో పీయూష్ గోయల్, మిట్టల్ స్థానంలో అశ్విని లోహాని బాధ్యతలు చేపట్టారు.
రైల్వే మంత్రి, బోర్డు చైర్మన్ ఈ ప్రమాదాలకు నైతిక బాధ్యత వహించడం మెచ్చుకోవలసిన విషయమే కానీ పదవులకు రాజీనామాలు చేయడం ఈ సమస్యలకు పరిష్కారం కాదని ఈరోజు జరిగిన ఈ ప్రమాదం రుజువు చేస్తోంది. ఇటీవల జరిగిన ఈ రైలు ప్రమాదాలన్నీ తెల్లవారు జామున 3-5 గంటల మద్య జరగడం గమనార్హం. ఆ సమయంలో రైలు డ్రైవర్లు కూడా నిద్రమత్తులో ఉన్నందునే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయా లేక ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే విషయం దర్యాప్తులో కనుగొని వాటి నివారణకు తగు చర్యలు చేపట్టినప్పుడే ఈ ప్రమాదాలను అరికట్టడం సాధ్యం అవుతుంది. డ్రైవర్ల పొరపాటే ఇందుకు కారణం అయ్యుంటే అందుకు ప్రయాణికులే కాకుండా రైల్వే మంత్రి, రైల్వేశాఖ, దానిలో అధికారులు కూడా బారీ మూల్యం చెల్లించవలసి వస్తోంది. వరుసగా జరుగుతున్న ఈ రైలు ప్రమాదాలు కేంద్రప్రభుత్వానికి కూడా తీరని అప్రదిష్ట కలిగిస్తున్నాయి. కనుక ఇకనైనా రైల్వేశాఖ ఈ వరుస ప్రమాదాలపై మరింత లోతుగా దర్యాప్తు చేసి సమస్య మూలాలను కనుగొని వాటిని పరిష్కరించడం మంచిది.