నందమూరి కుటుంబానికి అప్రదిష్ట

స్వర్గీయ నందమూరి తారక రామారావు కుమారులలో ఒకరైన నందమూరి జయకృష్ణకు చెక్ బౌన్స్ కేసులో ఎర్రమంజిల్ ప్రత్యేక న్యాయస్థానం 6 నెలల సాధారణ జైలు శిక్ష, రూ. 25 లక్షల జరిమానా విధించింది. అబీడ్స్ జంక్షన్ వద్ద గల జయకృష్ణకు చెందిన రామకృష్ణా థియేటర్ లో నరసింగరావు అనే వ్యక్తి క్యాంటీన్, సైకిల్ స్టాండ్ నడిపిస్తున్నారు. అందుకుగాను ఆయన జయకృష్ణకు రూ.25 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించారు. రామకృష్ణా థియేటర్ స్థానంలో మల్టీప్లెక్స్ నిర్మితమవుతునందున ఆ సొమ్మును జయకృష్ణ చెక్ రూపంలో నరసింగరావుకు తిరిగి ఇచ్చేశారు. అయితే జయకృష్ణ బ్యాంకు ఖాతాలో తగినంత సొమ్ము లేకపోవడంతో ఆ చెక్కులు బౌన్స్ అయ్యాయి. నరసింగరావు పిటిషన్ వేయడంతో దానిని విచారించిన ఎర్రమంజిల్ కోర్టు జయకృష్ణకు జైలుశిక్ష, జరిమానా విధించింది. అయితే ఈ తీర్పుపై ఎగువ కోర్టులో అప్పీలు చేసుకొనేందుకు వీలుగా అయనకు నెలరోజులు బెయిల్ మంజూరు చేసింది.

స్వర్గీయ నందమూరి తారక రామారావు కారణంగా ఆయన వంశానికి రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి పేరుప్రతిష్టలు, ప్రజలలో ఆదరణ గుర్తింపు ఉన్నాయి. ఆయన వారసులు బాలకృష్ణ, హరికృష్ణ, జూ.ఎన్టీర్, కళ్యాణ్ రామ్ తదితరులు అందరూ కూడా ఆ పేరు ప్రతిష్టలను నిలబెట్టుకొంటున్నారు. కనుక నందమూరి వంశస్తుడు ఒకరు ఇటువంటి కేసులో దోషిగా నిర్ధారించబడి జైలు శిక్ష, జరిమానాలు విధించబడటం వారి వంశానికే అప్రదిష్ట కలిగిస్తోంది. ఇటువంటి సమస్య రాకుండా ఆయన ముందే జాగ్రత్తపడి ఉండి ఉంటే బాగుండేది.