త్వరలో కేసీఆర్ విజయవాడ పర్యటన?

ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా ముఖ్యమైన పనేదో ఉంటే తప్ప సాధారణంగా తెలంగాణా సరిహద్దులు దాటడానికి ఇష్టపడరు. కనుక ఆయన రాష్ట్రం దాటి ఎక్కడకు బయలుదేరినా అది వార్తే అవుతుంది. ఈ నెల 27న ఆయన విజయవాడ వెళ్ళబోతున్నారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే తిరుపతి వెంకన్న స్వామికి బంగారు ఆభరణాలు, బెజవాడ కనకదుర్గమ్మకు ముక్కు పుడక సమర్పించుకొంటానని మొక్కుకొన్నారు. వెంకన్నస్వామి మొక్కు తీర్చుకొన్నారు కానీ మూడున్నరేళ్ళు పూర్తి కావస్తున్నా ఇంతవరకు అమ్మవారి మొక్కు తీర్చుకోలేకపోయారు. గతంలో కూడా ఒకసారి ఆయన విజయవాడకు వచ్చి మొక్కు తీర్చుకోవాలనుకొన్నారు కానీ పనుల ఒత్తిడి కారణంగా ఆఖరు నిమిషంలో పర్యటన వాయిదా పడింది. కనుక ఈసారి తప్పకుండా మొక్కు తీర్చుకోవాలని నిశ్చయించుకొన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఆయన విజయవాడ పర్యటనకు ఏపి అధికారులతో మాట్లాడి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.