సీనియర్ జర్నలిస్ట్ హత్య

సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ (55) బెంగళూరులో తన నివాసం వద్ద మంగళవారం రాత్రి సుమారు 8 గంటలకు హత్య చేయబడ్డారు. ఆమె తన ఇంట్లోకి ప్రవేశిస్తుండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై వచ్చి ఆమెపై అతి సమీపం నుంచి కాల్పులు జరుపడంతో ఆమె మెడ, ఛాతిలోకి బుల్లెట్లు దూసుకుపోవడంతో అక్కడే చనిపోయారు.

ఆమె 'గౌరీ శంకర్ పత్రికె' అనే కన్నడ పత్రిక ద్వారా భాజపా, దాని హిందుత్వ రాజకీయాలపై విమర్శనాత్మక వార్తలు, విశ్లేషణలు ప్రచురిస్తుంటారు. ఆ కారణంగా ఆమెపై ఇద్దరు భాజపా ఎమ్మెల్యేలు కోర్టులో కేసులు వేయగా ఆమెకు జరిమానా, జైలు శిక్ష విదించబడింది. బెయిల్ పై బయటకు వచ్చిన తరువాత మళ్ళీ ఆమె యధాప్రకారం హిందుత్వ రాజకీయాలపై విమర్శనాత్మక కధనాలు ప్రచురిస్తున్నారు. బహుశః ఆకారణంగానే ఆమెపై కక్ష పెంచుకొన్నవారు ఎవరో ఈ దారుణానికి ఒడిగట్టి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు.

నేరస్తులను పట్టుకొనేందుకు మూడు పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర డిజిపి ఆర్.కే.దత్తా మీడియాకు తెలిపారు. కర్నాటక, పశ్చిమ బెంగాల్, కేరళ ముఖ్యమంత్రులు సిద్దరామయ్య, మమతా బెనర్జీ, పినర్యి విజయన్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, సిపిఎం నేత సీతారం ఏచూరి తదితరులు ఈ హత్యను ఖండిస్తున్నట్లు ప్రకటించారు.  

కర్నాటకలో పాత్రికేయులపై ఇటువంటి దాడులు జరుగడం కొత్తేమీ కాదు. రెండేళ్ళ క్రితం ఆగస్ట్, 2015లో ప్రముఖ హేతువాద రచయిత ఎంఎం కల్బుర్గి (77) ఈవిధంగానే గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురయ్యారు.