తెరాస ఎమ్మెల్యేకు ఎదురుదెబ్బ

తెరాస వేములవాడ ఎమ్మెల్యే డాక్టర్ చెన్నమనేని రమేష్ బాబు భారతీయ పౌరసత్వం చెల్లదని కేంద్ర హోంశాఖ తేల్చి చెప్పింది. మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వర్‌రావు కుమారుడైన ఆయన ఉన్నత విద్యలభ్యసించేందుకు జర్మనీ వెళ్ళి అక్కడే స్థిరపడి జర్మనీ మహిళను వివాహం చేసుకొన్నారు. కనుక జర్మనీ పౌరసత్వం లభించింది. అయినా తన భారతీయ పౌరసత్వాన్ని కూడా నిలుపుకొన్నారు. తరువాత కొన్ని కారణాల వలన ఆయన భారత్ తిరిగివచ్చి రాజకీయాలలోకి ప్రవేశించి 2009లో తెదేపా తరపున వేములవాడ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. ఆ తరువాత తెరాసలో చేరి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన చేతిలో ఓడిపోయిన ఆది శ్రీనివాస్ ఆయన పౌరసత్వం చెల్లదంటూ సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఈ అంశంపై న్యాయస్థానం హోంశాఖ అభిప్రాయాన్ని కోరగా రమేష్ బాబు పౌరసత్వం చెల్లదని అది స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు దానిని పరిగణనలోకి తీసుకొని తీర్పు చెప్పే అవకాశం ఉంది కనుక రమేష్ బాబు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయవలసి రావచ్చు. అయితే ఆయన రాజకీయాలలో కొనసాగాలనుకొన్నా వద్దనుకొన్నా దేశంలో ఉండాలనుకొంటే ఖచ్చితంగా భారతీయ పౌరసత్వం కలిగి ఉండాల్సి ఉంటుంది కనుక మళ్ళీ దాని కోసం దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. 

ఆయన ఎన్నికలలో పోటీ చేయడానికి ముందు దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ లోనే తన ద్వంద పౌరసత్వం గురించి స్పష్టంగా పేర్కొన్నారు. కనుక ఎన్నికల సంఘం అప్పుడే దీనిపై న్యాయనిపుణల సలహాలు తీసుకొందో లేదో తెలియదు. అప్పుడే ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల కమీషన్ ద్వారా కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి సలహా కోరి ఉండి ఉంటే బహుశః ఇది ఇంత పెద్ద సమస్య అయ్యుండేది కాదు కదా? ఏమైనప్పటికీ తెరాస, భాజపాలు దీనిపై రాజకీయాలు మొదలుపెట్టకుండా సంయమనం పాటిస్తే మంచిది.