ఈరోజు ఒక ఎయిర్ ఇండియా (బోయింగ్ 737-800) విమానానికి పెను ప్రమాదం త్రుటిలో తప్పిపోయింది. అబుదాబి-కోచి ఎక్స్ ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ IX 452 విమానం మంగళవారం ఉదయం కేరళలోని కోచి విమానాశ్రయం చేరుకొన్న తరువాత రన్-వే పై నుంచి జారి పక్కకు వెళ్లిపోయింది. విమానాన్ని పైలట్లు అడుపుచేసి నిలిపేలోగా దాని ముందు భాగంలో ఉండే చక్రాలలో ఒకటి ఊడిపడిపోయింది. ఆ సమయంలో విమానంలో 102 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాదం మంగళవారం తెల్లవారు జామున సుమారు 2.30 గంటలకు జరిగింది.
ఒకవేళ విమానం క్రిందకు దిగుతున్నప్పుడు ముందు చక్రం ఊడిపడిపోయున్నా లేదా రన్ వే దాటి ముందుకు వెళ్ళిపోతున్న విమానాన్ని పైలట్లు సకాలంలో అదుపు చేయలేకపోయినా ఎంత ప్రమాదం జరిగేదో ఊహించుకోవచ్చు. సాంకేతిక సమస్య కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. విమానం ఆగిన వెంటనే ప్రయాణికులను దింపివేసి వాహనాలలో విమానాశ్రయంలోకి తరలించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదు కానీ ప్రయాణికులు, సిబ్బంది చాలా ఆందోళన చెందారు. ఈ ప్రమాదంపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డి.జి.సి.ఏ.) విచారణకు ఆదేశించారు.