నేరెళ్ళ ఘటన, భాధితుల గురించి ఇప్పుడు అధికార, ప్రతిపక్ష నేతలు ఎవరూ పెద్దగా మాట్లాడటం లేదు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ లో తెరాస ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నం చేసుకొన్న ఇద్దరు దళితుల గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన దళితులకు మూడెకరాల భూపంపిణీ కార్యక్రమంలో తమకు అన్యాయం జరిగిందనే ఆవేదనతో వారిరువురు ఆత్మహత్యాయత్నం చేసుకొన్నారు. ఆసుపత్రిలో ఉన్న వారిరువురినీ ఈసారి తెరాస నేతలే మొదట పరామర్శించారు. వారిని హైదరాబాద్ తరలించిన తరువాత రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పరామర్శించారు.
అనంతరం పిసిసి అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్రాసిన బహిరంగ లేఖను మీడియాకు విడుదల చేశారు. కేసీఆర్ మూడున్నరేళ్ళ పాలనలో రాష్ట్రంలో గిరిజనులు, దళితులపై దాడులు పెరిగాయని ఆ లేఖలో ఆరోపించారు. సమాచార చట్టం హక్కు ద్వారా సంపాదించిన వివరాలను ఆ లేఖలో పొందుపరిచారు.
2014 జూన్ నుంచి 2016 డిశంబర్ వరకు 1, 592 ఎస్సీ ఎస్టీ వేధింపుల కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. వాటిలో దళిత మహిళలపై అత్యాచారాల కేసులు 502, హత్యకేసులు 120 నమోదు అయ్యాయని లేఖలో పేర్కొన్నారు. ఈ మూడున్నరేళ్ళలో ఆర్ధిక సమస్యల కారణంగా ఆత్మహత్యలు చేసుకొన్న 3500 మంది రైతులలో అత్యధికులు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందినవారేనని పేర్కొన్నారు. పోలీసులు తెరాస ప్రతినిధులలాగ వ్యవహరిస్తూ నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాల ప్రజలపై తమ ప్రతాపం చూపిస్తున్నారని ఆరోపించారు. తెరాస సర్కార్ మూడున్నరేళ్ళ పాలన దళిత, గిరిజన వ్యతిరేకంగా సాగిపోతోందని ఉత్తం కుమార్ రెడ్డి విమర్శించారు.