ప్రపంచంలో ప్రజలందరికీ..ముఖ్యంగా యువతకు తమ అభిప్రాయాలను ఇతరులతో పంచుకొనేందుకు సోషల్ మీడియా చక్కటి వేదికగా ఉపయోగపడుతోంది. కనుక వ్యాపాసంస్థలు, సినీ పరిశ్రమ, చివరికి పోలీస్ శాఖ, రాజకీయ పార్టీలు కూడా సోషల్ మీడియాను చక్కగా ఉపయోగించుకొని ప్రయోజనం పొందుతున్నాయి.
సోషల్ మీడియా పేరు చెప్పగానే మొదట వినబడే పేర్లు గూగూల్, ఫేస్ బుక్, ట్వీట్టర్, వాట్స్ అప్, ఇంస్టాగ్రామ్. అవి ఎంతగా ప్రజాధారణ పొందుతున్నాయో అందరికీ తెలుసు. అయితే వాటిలో చాలాసార్లు చాలా అభ్యంతరకరమైన సమాచారం, కామెంట్లు, చిత్రాలు, వీడియోలు వంటివి షేర్ అవుతున్నాయి. వాటిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తే భావప్రకటన స్వేచ్చకు సంకెళ్ళు వేస్తున్నారని వాదించేవారున్నారు. కనుక ప్రభుత్వం లేదా పోలీస్ శాఖ ఆదేశిస్తే తప్ప వాటిలో ఉంచిన సమాచారాన్ని తొలగించేందుకు లేదా అదుపు చేసేందుకు ఆ సంస్థలు ప్రయత్నించడం లేదు.
వాటి ఈ వైఖరి వలన సోషల్ మీడియాలో నానాటికీ విశ్రుంఖలత్వం పెరిగిపోతోంది. భావప్రకటన స్వేచ్చ పేరిట చైల్డ్ పోర్నోగ్రఫీ, సామూహిక అత్యాచారాలు, హత్యలు, ఆత్మహత్యలు, దోపిడీలు వంటి అసాంఘీక కార్యక్రమాలకు సంబంధించి చాలా అభ్యంతరకరమైన సమాచారం, ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా లభిస్తున్నాయి.
హైదరాబాద్ కు చెందిన ప్రజ్వల ఎన్జీవో సంస్థ వీటిని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్.దత్తు దృష్టి తీసుకురాగా ఆయన దానిని సుప్రీంకోర్టుకు తెలియజేయడంతో న్యాయస్థానం వెంటనే స్పందించి గూగుల్, ఫేస్ బుక్, వాట్స్ అప్ సంస్థలకు నోటీసులు పంపించింది.
ఇటువంటి హేయమైన నేరాలకు సంబంధించి సమాచారం, ఫోటోలు, వీడియోలను అదుపు చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకొంటున్నాయో తెలియజేయాలని ఆ మూడు సంస్థలను సుప్రీంకోర్టు ఆదేశించింది. 2016 నుంచి ఆగస్ట్ 2017వరకు అటువంటి వాటిపై ఆ సంస్థలకు అందిన పిర్యాదులు, అవి తీసుకొన్న చర్యల గురించి పూర్తి వివరాలను తెలియజేయాలని జస్టిస్ మదన్ బి. లోకూర్, జస్టిస్ యు.యు.లలిత్ లతో కూడిన సర్వోన్నత ధర్మాసనం సుప్రీంకోర్టు ఆదేశించింది.