కేటిఆర్ కు ప్రతిష్టాత్మక అవార్డు

తెలంగాణా ఐటి శాఖ మంత్రి కేటిఆర్ కు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డుకు ఎంపికయ్యారు. డిల్లీ సమీపంలోని గుర్గావ్ కేంద్రంగా పనిచేస్తున్న స్కోచ్ గ్రూప్ సంస్థ ఏటా వివిధ రంగాలలో కృషి చేస్తున్న వారికి అవార్డులు ఇస్తుంటుంది. 

కేటిఆర్ రాష్ట్ర ఐటి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్రంలో ఐటి రంగం అభివృద్ధి చేయడం కోసం ఐటి పాలసీని ప్రకటించి అనేక సంస్కరణలు చేపట్టారు. వాటిలో భాగంగా రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి ఇంక్యుబేటర్స్, ఐటీ హబ్స్ ఏర్పాటు చేయించారు. అలాగే ఐటి రంగాన్ని రాష్ట్రంలో ఇతర జిల్లాలకు కూడా విస్తరించేందుకు చాలా కృషి చేస్తున్నారు. ఆయన చేస్తున్న ఈ ప్రయత్నాల కారణంగా గత రెండేళ్లలో తెలంగాణా ఐటి రంగం అద్భుతమైన ప్రగతి సాధించింది. రెండేళ్ళ క్రితం తెలంగాణా ఐటి రంగం దేశంలో 18వ స్థానంలో ఉండగా ఇప్పుడు నెంబర్: 1 స్థానం చేరుకొంది.

ఐటి రంగంలో తెలంగాణా యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచింది. కనుక మంత్రి కేటిఆర్ చేసిన ఈ కృషికి గుర్తింపుగా “ఐటి మినిస్టర్ ఆఫ్ ద ఇయర్” అవార్డుకు ఎంపిక చేశామని స్కోచ్‌ గ్రూప్‌ చైర్మన్‌ సమీర్‌ కొచార్‌ తెలియజేశారు. ఈ ఏడాది డిశంబర్ 9న డిల్లీలో జరిగే ఆ సంస్థ 49వ సదస్సులో మంత్రి కేటిఆర్ కు ఈ అవార్డు ప్రధానం జరుగుతుంది.