కేంద్రప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ (సిపిఎస్) పధకాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు నిన్న సామోహ్హిక శలవులు పెట్టి అన్ని జిల్లాలలో, హైదరాబాద్ లో తమ తమ కార్యాలయాలు, సచివాలయం వద్ద ధర్నాలు చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కొత్త విధానంతో తాము తీవ్రంగా నష్టపోతామని కనుక మళ్ళీ పాత పెన్షన్ విధానాన్నే అమలుచేయాలని కోరుతూ ఆందోళన చేశారు. ఉద్యోగులు పదవీ విరమణ తరువాత వారి జీవితాలకు భద్రత కల్పించడానికి ఉద్దేశ్యించబడిన పెన్షన్లను ముట్టుకొంటే సహించబోమని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి. ప్రభుత్వం తక్షణమే ఈ కొత్త విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలుచేయాలని లేకుంటే తమ పోరాటం ఉదృతం చేస్తామని హెచ్చరించారు. తమ ఈ డిమాండ్ పై కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోతే వచ్చే నెలలో అన్ని జిల్లాల నుంచి ఛలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించి రాజధానిలో సభ నిర్వహిస్తామని హెచ్చరించారు. ఉద్యోగులు మూకుమ్మడిగా శలవులు పెట్టడంతో నిన్న రాష్ట్రంలో చాలా ప్రభుత్వ కార్యాలయాలు ఖాళీగా కనిపించాయి.