ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనతో ఏర్పాటు అవుతున్న తెలంగాణా రైతు సమన్వయ సమితులను వ్యతిరేకిస్తున్నట్లు తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ దాని పరిసర జిల్లాలలో ఉన్న లక్షల కోట్ల విలువచేసే భూములను కేసీఆర్, కుటుంబ సభ్యులు స్వంతం చేసుకొని వాటిపై అధికారికంగా యాజమాన్యపు హక్కు కల్పించుకోవడం కోసమే ఆయన ఈ సరికొత్త నాటకానికి తెరలేపారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అదేవిధంగా గ్రామాలలో వివాదరహిత ప్రభుత్వ భూములను తెరాస నేతలకు కట్టబెట్టడానికే జీవో నెంబర్ : 39 జారీ చేసినట్లు భావిస్తున్నామని అన్నారు.
డి.శ్రీనివాస్, కె. కేశవ్ రావు వంటి తెరాస నేతలు, గోల్డ్ స్టోన్ ప్రసాద్ వంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించుకొన్న అసైన్డ్ భూములపై వారికి యాజమాన్యపు హక్కులు కల్పించడానికే కేసీఆర్ ఈ కార్యక్రమం మొదలుపెట్టారని అన్నారు. తెరాస మంత్రులు, నేతల కనుసన్నలలో తెరాస కార్యకర్తలతో కూడిన రైతు సమన్వయ సమితిలను ఏర్పాటు చేసుకొని వాటి ద్వారా తమకు అనుకూలంగా భూరికార్డులు సృష్టించుకొని, రాజముద్ర వేయించుకోవడానికే ఈ సరికొత్త నాటకం మొదలుపెట్టారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. దీనిపై తాము ఇప్పటికే న్యాయవాదులతో మాట్లాడుతున్నామని త్వరలోనే దీనిపై న్యాయపోరాటం ప్రారంభిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు.