దత్తన్న కూడా రాజీనామా

కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ శుక్రవారం రాత్రి తన పదవికి రాజీనామా చేశారు. రేపు జరుగబోయే కేంద్రమంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కోసం ఆయనను రాజీనామా చేయవలసిందిగా భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కోరడంతో ఆయన తప్పుకొన్నారు. 

అయన భాజపాకు చెందినవారైనప్పటికీ ఎక్కువగా తెరాస సర్కార్ మంత్రుల పక్కనే కనిపిస్తుంటారు. కేంద్రమంత్రిగా అది తప్పు కాకపోవచ్చు కానీ రాష్ట్రంలో భాజపా నేతలందరూ తెరాస సర్కార్ ను తమ రాజకీయ శత్రువుగా భావించి పోరాడుతున్నప్పుడు ఆయన తెరాస మంత్రులతో భుజాలు రాసుకొని తిరుగుతుండటం అది వారికి బయటకు చెప్పుకోలేని ఇబ్బందికరమైన విషయమే. ఆయనను రాజీనామా కోరడానికి బహుశః ఇదీ ఒక కారణం కావచ్చు. మరొక ఏడాదిన్నర తరువాత ఎప్పుడైనా సార్వత్రిక ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది కనుక మంత్రివర్గంలోకి యువకులు, చురుకుగా పనిచేసేవారిని తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా భావిస్తున్నందునే దత్తన్న రాజీనామా కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.    

ఆయన స్థానంలో కరీంనగర్ కు చెందిన భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావును మంత్రివర్గంలోకి తీసుకొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆదివారం ఉదయం 10 గంటలకు కొత్త మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగబోతోంది. మంత్రివర్గంలో 10 మంది పాతవారిని తొలగించి 12 మంది కొత్తవారిని నియమించబోతున్నట్లు సమాచారం. అలాగే కొంతమంది మంత్రుల శాఖలలో మార్పులు, పదోన్నతులు కూడా జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.