ఇటీవల వరుసగా జరిగిన రైలు ప్రమాదాలకు నైతిక బాధ్యత వహిస్తూ రైల్వే మంత్రి సురేష్ ప్రభు రాజీనామాకు సిద్దపడిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే కొన్ని రోజులు ఆగమని ప్రధాని మోడీ సూచించడంతో ఆయన ఇంకా పదవిలో కొనసాగుతున్నారు. అయితే రేపు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉన్నందున రైల్వే మంత్రిగా బహుశః ఈరోజే ఆయనకు ఆఖరు రోజు కావచ్చు. ఆయన పదవిలో నుంచి దిగిపోయే ముందు ప్రయాణికులకు చాలా మేలు చేకూర్చే ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు.
ఇంతవరకు ఏ కారణాల చేతైనా రైల్వే టికెట్ కొన్నవ్యక్తి తన ప్రయాణం రద్దు చేసుకోవలసి వస్తే ఆ టికెట్ ను క్యాన్సిల్ చేసుకోవలసి వచ్చేది. కానీ టికెట్ ధరలో సగం లేదా ఒక్కోసారి పూర్తిగా కట్ అయిపోయేది. కానీ ఇక మీదట ఆఖరు నిమిషంలో ప్రయాణం రద్దు చేసుకోవలసి వస్తే ఆ టికెట్ ను కుటుంబ సభ్యులెవారికైనా బదిలీ చేసుకోవచ్చు. అయితే కనీసం 24 గంటల ముందుగా రైల్వే రిజర్వేషన్ సూపర్ వైజర్ కు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. అందుకు దరఖాస్తుతో పాటు టికెట్ కొన్నవారు, దానిని బదిలీ చేసుకొంటున్నవారివి గుర్తింపుకార్డు కాపీలను సమర్పించవలసి ఉంటుంది.
విద్యార్ధులైతే తోటి విద్యార్దుల పేరిట బదిలీ చేసుకోవచ్చు. అలాగే కేంద్రరాష్ట్ర ఉద్యోగులు సహఉద్యోగుల పేరిట బదిలీ చేసుకోవచ్చు. త్వరలోనే తత్కాల్ లో కూడా ఈ విధానం ప్రవేశపెట్టబోతున్నట్లు దక్షిణ మద్య రైల్వే పబ్లిక్ రిలేషన్స్ అధికారి ఉమాశంకర్ చెప్పారు.
రైల్వేలు భారతదేశానికి జీవనాడి వంటివనే గొప్ప పేరున్నప్పటికీ ఇంతకాలం ఆ శాఖకు మంత్రులుగా చేసిన వారందరూ ప్రయాణికుల నుంచి ఏవిధంగా ఇంకా ఎక్కువ డబ్బు పిండుకొందామనే ఆలోచించేవారు తప్ప ఏనాడూ ప్రయాణికులు నష్టపోకుండా చూడాలని ఆలోచించలేదు. లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు రైల్వేల ఆదాయం పెంచేందుకు రైల్వే కంపార్టుమెంట్లలో ఉండే రెండు సైడ్ బెర్తుల మద్యలో మూడో బెర్త్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నించి విమర్శలు ఎదురవడంతో ఆ ప్రయత్నం విరమించుకొన్న సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది.
కానీ వారందరికీ భిన్నంగా సురేష్ ప్రభు భారతీయ రైల్వేలను అభివృద్ధి పట్టాలపై పరుగులు తీసేందుకు అనేక సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. పోతూపోతూ ప్రయాణికులకు చాలా మేలు కలిగే ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపి మరీ వెళ్ళిపోతున్నారు. అందుకు ఆయనకు కృతజ్ఞతలు చెప్పక తప్పదు.