హైదరాబాద్ నగరంలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం పూర్తిచేసి వచ్చే ఏడాది దసరా పండుగనాడు లబ్దిదారులందరిచేత తప్పకుండా గృహాప్రవేశం చేయిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్ చెప్పారు. మేడ్చల్ లోని రాంపల్లిలో రవాణాశాఖ మంత్రి పి. మహేందర్ రెడ్డితో కలిసి కేటిఆర్ గురువారం 6,264 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. ఆ సందర్భంగా ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “హైదరాబాద్ నగరంలో నిర్మిస్తున్న లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళలో వచ్చే దసరా పండుగ రోజున మీరందరూ గృహాప్రవేశం చేసుకొంటారు. ఈ 6,264 ఇళ్ళకి కేటాయించిన రూ.549 కోట్లతో కలిపి ఒక్క హైదరాబాద్ నగరంలోనే మొత్తం లక్ష ఇళ్ళ నిర్మాణానికి ప్రభుత్వం రూ.20,000 కోట్లు ఖర్చు చేస్తోంది. కనుక అర్హులైన ప్రతీ ఒక్కరికీ తప్పనిసరిగా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు లభిస్తుంది. కనుక ఎవరూ ఇళ్ళు ఇప్పిస్తామని చెప్పే దళారుల మాటలను నమ్మి మోసపోవద్దు. నగరంలో మురికివాడలను తొలగించి వాటి స్థానంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళతో కూడిన అందమైన కాలనీలు నిర్మించబోతున్నాము. కనుక మురికివాడలలో నివసిస్తున్న ప్రజలు ముందుకు వచ్చి ప్రభుత్వానికి సహకరించినట్లయితే ఎక్కడికక్కడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మించి ఇవ్వడానికి సిద్దంగా ఉన్నాము. వచ్చే ఏడాదిలోగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2.65 లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాము. అయితే వాటితో ఈ పధకం ముగించాలనుకోకుండా దీనిని నిరంతరంగా కొనసాగించాలని భావిస్తున్నాము. రాష్ట్రంలో అర్హులైన పేదవారందరికీ ఇళ్ళు అందించాలనేదే మా ప్రభుత్వ ఆశయం,” అని అన్నారు.