కాకినాడలో కూడా వైకాపాకు ఎదురుదెబ్బ?

కాకినాడ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలలో కూడా తెదేపా విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఈరోజు ఉదయం నుంచి మొదలైన ఓట్ల లెక్కింపులో మొదటి రౌండ్ నుంచే తెదేపా ఆధిఖ్యత కనబరచసాగింది. మొత్తం 48 వార్డులలో ఇంతవరకు తెదేపా 20 వార్డులలో ఆధిఖ్యతలో ఉండగా వైకాపా కేవలం 6 స్థానాలలో మాత్రమే ఆధిఖ్యతలో ఉంది. ఇంతవరకు వెలువడిన ఫలితాలలో తెదేపా-14, వైకాపా-2 స్థానాలు గెలుచుకొన్నాయి. ఇక షరా మామూలుగానే కాంగ్రెస్ ఒక్క స్థానంలో కూడా కనబడలేదు. కాకినాడలో భాజపాకు మంచి పట్టు ఉంది కనుక అది 9 స్థానాలకు పోటీ చేసింది. అయితే ఇంతవరకు అది కూడా ఎక్కడా ఆధిఖ్యత కనబరచలేదు. బహుశః మరొక రెండు గంటలలోగా పూర్తి ఫలితాలు వెలువడవచ్చు. 

నంద్యాల ఉపఎన్నికలలో ఎదురుదెబ్బ తిన్న జగన్మోహన్ రెడ్డికి వెంటనే జరిగిన ఈ ఎన్నికలలో కూడా వైకాపా ఓడిపోవడం జీర్ణించుకోవడం కష్టమే. నంద్యాలలో తరువాత కాకినాడలో చేసిన ఎన్నికల ప్రచారంలో బాబు పాలనకు  వ్యతిరేకంగా ఓటు వేసి తీర్పు చెప్పాలని జగన్ ప్రజలను కోరారు. కాకినాడలో కూడా తెదేపాను గెలిస్తే ప్రజలు చంద్రబాబు పాలనను మెచ్చి ఓటేశారని తెదేపా నేతలు చెప్పుకొనే అవకాశం జగన్మోహన్ రెడ్డే కల్పించారు. కనుక ఆవిధంగా కోరడం వ్యూహాత్మకం తప్పని రుజువుకాబోతోంది.