రాష్ట్రంలో నేటి నుంచి సెప్టెంబర్ 9 వరకు రైతు సమన్వయ సమితుల ఏర్పాటు ప్రక్రియ మొదలవబోతోంది. ఆ తరువాత వాటి సదస్సులు, సభ్యులకు శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. అవి ముగిసిన తరువాత సెప్టెంబర్ 15 నుంచి డిశంబర్ 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం జరుగుతుంది. అది ముగియగానే కొత్త సంవత్సరంలో రాష్ట్రంలో రైతులందరికీ కొత్త పట్టాదార్ పాసు పుస్తకాలు ఇవ్వబడతాయి.
ఈ కార్యక్రమాలలో ప్రతీది చాలా సంక్లిష్టమైనదే కనుక జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ, పంచాయితీ, వ్యవసాయ శాఖా అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న ప్రగతి భవన్ లో సమావేశమయ్యి ప్రతీ అంశంపై లోతుగా చర్చించి వీటిలో ప్రతీ కార్యక్రమం అమలుకు నిర్దిష్టమైన మార్గదర్శకాలు ఖరారు చేశారు.
గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రైతు సమన్వయ సమితిల ఏర్పాటు బాధ్యత ఇన్-ఛార్జ్ మంత్రులకు అప్పగించారు. ఈ ప్రక్రియకు జిల్లా కలెక్టర్లు నోడల్ అధికారులుగా వ్యవహరిస్తారు.
ఇక భూప్రక్షాళన బాధ్యత అంతా పూర్తిగా జిల్లా కలెక్టర్లకే అప్పగించారు. ఈ కార్యక్రమం పూర్తి చేయడానికి ఒక్కో కలెక్టరుకు రూ.50 లక్షలు అందుబాటులో ఉంచుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.
రాష్ట్రంలోని మొత్తం 1.75 లక్షల మంది రైతులు ఈ రైతు సమన్వయ సమితులలో సభ్యులుగా ఉంటారు. వారి సహాయసహకారాలతో తరువాత భూప్రక్షాళణ కార్యక్రమం కూడా పూర్తి చేసి రైతులందరికీ అర్ధమయ్యే సరళమైన భాషలో వారి భూమి వివరాలతో కూడిన పట్టాదార్ పాసు పుస్తకాలను వచ్చే సంవత్సరంలో అందించడానికి వివిధశాఖల అధికారులు అందరూ పూర్తి సమన్వయంతో కలిసి పనిచేయాలని కోరారు.