
గురువారం రాత్రి నలుగురు కేంద్రమంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. అలాగే మరికొందరు నేడు రాజీనామాలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. కేంద్ర జలవనరు మంత్రి ఉమా భారతి, అదే శాఖకు చెందిన సహాయ మంత్రి సాంజీ బలియన్, నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయమంత్రి రాజీవ్ ప్రతాప్ రూడి, మానవ వనరుల శాఖ సహాయ మంత్రి మహేంద్ర లాల్ పాండే నిన్న రాత్రి తమ పదవులకు రాజీనామా చేశారు.
మంత్రివర్గంలో కొన్ని మార్పులు చేర్పులు చేయడానికి వీలుగా వారిని రాజీనామాలు చేయమని ప్రధాని నరేంద్ర మోడీ కోరడంతో వారు తప్పుకొన్నారు.
నేడు అశోక్ గజపతి, రాజు నిర్మలా సీతారామన్, చౌదరీ బీరేంద్ర సింగ్, ఫగ్గాన్ సింగ్ కులస్తే, కల్రాజ్ మిశ్రా తదితరులు నేడు రాజీనామా చేయవచ్చని సమాచారం.
ప్రధాని నరేంద్ర మోడీ సెప్టెంబర్ 3వ తేదీ నుంచి చైనాలో జరుగబోయే మూడు రోజుల బ్రిక్స్ సదస్సుకు బయలుదేరనున్నారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తన తిరుమల పర్యటన ముగించుకొని శనివారం మధ్యాహ్నానికి మళ్ళీ డిల్లీ చేరుకొంటారు. కనుక శనివారం రాత్రి కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది.
రైల్వే మంత్రి సురేష్ ప్రభు రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోడీకి సమర్పించారు కనుక ఆ బాధ్యతలను కూడా ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కారీకి అప్పగించి, సురేష్ ప్రభును వేరే శాఖకు మార్చవచ్చని సమాచారం. అలాగే అరుణ్ జైట్లీ అదనంగా నిర్వహిస్తున్న రక్షణ శాఖకు కొత్తమంత్రిని నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ నుంచి తెదేపాకు చెందిన కంబంపాటి హరిబాబుకు, ఎన్డీయే కూటమిలో మళ్ళీ చేరిన బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు చెందిన జెడియులో ఇద్దరికి మంత్రివర్గంలో స్థానం లభించవచ్చు. మంత్రిపదవులలో నుంచి తప్పుకొన్న భాజపా నేతలను పార్టీ సేవలకు ఉపయోగించుకోబోతున్నారు.