కొందరు తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలు తమతో టచ్చులో ఉన్నారని, వారు తెరాసను వీడి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నారని తెలంగాణా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క చెప్పిన మాటలపై ఊహించినట్లుగానే తెరాస చాలా ఘాటుగా స్పందించింది.
మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్ర కాంగ్రెస్ భవిష్యత్ అగమ్యగోచరంగా కనబడుతుండటంతో ఆ పార్టీ నేతలు చాలా ఆందోళనతో, నిరాశ నిస్పృహలతో ఉన్నారు. వాటిని కప్పిపుచ్చుకోనేందుకే ఇటువంటి మైండ్ గేమ్స్ తో కాలక్షేపం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న పడవ వంటిది. బుద్ధున్నవారెవరైనా దానిలో ఎక్కేందుకు సాహసిస్తారా? ఆ పార్టీలో రిటైర్మెంటులే తప్ప రిక్రూట్మెంట్లు ఉండవిక. కనుక వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది మిగిలి ఉంటారో లెక్క చూసుకొంటే మంచిదని వారికి నా సలహా. ఇకనైనా ఇటువంటి దిక్కుమాలిన మైండ్ గేమ్స్ ఆడటం మానుకొంటే మీకే మంచిది,” అని అన్నారు.
భూసర్వేలను, రైతు సమన్వయ సమితిలపై కాంగ్రెస్ అభ్యంతరాలు చెప్పడంపై స్పందిస్తూ, “రాష్ట్రంలో ప్రభుత్వం తలపెట్టిన సమగ్ర భూసర్వేను, రికార్డుల ప్రక్షాళనను రైతు సమన్వయ సమితిల ఏర్పాటును అడ్డుకొంటామని బెదిరిస్తోంది. రికార్డుల ప్రక్షాళన జరిగిత తమ హయంలో జరిగిన భూభాగోతాలన్నీ బయటపడతాయనే భయంతోనే వారు అడ్డుకోవాలనుకొంటున్నారు. రాజకీయాలకు అతీతంగా రైతు సమన్వయ సమితిలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే దానినీ అడ్డుకొంటామని కాంగ్రెస్ నేతలు చెపుతున్నారు. రాష్ట్రాభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు అసహ్యించుకొంటున్నారు. ఆ కారణంగా అది ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకొంది. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా లభించే అవకాశం లేదు. ఇకనైనా కాంగ్రెస్ నేతలు తమ తీరు మార్చుకొంటే మంచిది,” అని హరీష్ రావు అన్నారు.