వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ మాజీ తెరాస అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్ బుధవారం మంత్రి మహేందర్ రెడ్డి సమక్షంలోనే ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. తాండూరులో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరైన ఆయుబ్ ఖాన్ మంత్రిగారి అనుమతితో అందరి కంటే ముందుగా మాట్లాడాడు.
తెరాస ప్రారంభించినప్పటి నుంచి పార్టీతో ఉంటూ, అనేక ఉద్యమాలలో పాల్గొన్న తనవంటి వారికి పార్టీలో తగిన గుర్తింపు, ప్రాధాన్యత లేకుండాపోయిందని, ఇతర పార్టీల నుంచి కొత్తగా వచ్చి చేరినవారికే ఎక్కువ ప్రాధాన్యత, పదవులు లభిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. ఉద్యమకారులను పార్టీ పట్టించుకోవడం మానేసిందని వారికి కనీసం నామినేటడ్ పదవులు ఇవ్వడానికి కూడా ఆలోచించడంలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తెలంగాణా రాష్ట్ర సాధన కోసం ఎంతగానో పోరాడిన తన వంటివారికి పార్టీలో చాలా అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు.
అనంతరం తన ప్రసంగం ముగించి వేదిక దిగి తన వెంట తెచ్చుకొన్న కిరోసిన్ ను పోసుకొని ఒంటికి నిప్పంటించుకొన్నాడు. వెంటనే అందరూ తేరుకొని మంటలు ఆర్పి అతనిని అంబులెన్స్ లో స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాధమిక చికిత్స చేసిన తరువాత అంబులెన్స్ లో హైదరాబాద్ కు తరలించారు. ఆయుబ్ ఖాన్ తల, ఛాతి, భాగాలు కాలిపోవడంతో అతని పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.
ఒక్కప్పుడు ఉద్యమపార్టీగా వ్యవహరించిన తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత పక్కా రాజకీయ పార్టీగా మారిపోయి అందుకు అనుగుణంగానే వ్యవహరిస్తోంది. రాజకీయంగా తనకు ఎదురులేకుండా చేసుకొని బలపడి తన అధికారాన్ని సుస్థిరం చేసుకొనేందుకు ఇతర పార్టీలలో బలమైన నేతలను పార్టీలోకి ఆకర్షించి వారికి, వారి అనుచరులకు పదవులు కట్టబెట్టింది. ఆ కారణంగా ఒకప్పుడు ఉద్యమకారులతో నిండిఉండే తెరాస ఇప్పుడు కాంగ్రెస్, తెదేపాల మిశ్రమపార్టీగా మారిపోయింది. ఒకప్పుడు తెరాసను, దాని ఉద్యమాలను వ్యతిరేకించినవారే నేడు కీలకపదవులు, నామినేటడ్ పోస్టులు అనుభవిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. తెలంగాణా ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్న కొంతమంది తెరాస నేతలు, కార్యకర్తలకు కొన్ని పదవులు దక్కినప్పటికీ సింహభాగం ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే దక్కుతున్నాయి. అది చూసి ఆయుబ్ ఖాన్ వంటి ఉద్యమకారుల గుండె రగిలిపోవడం సహజమే. ఈ విషాదఘటన తెరాసలో అంతర్గతంగా నెలకొన్న అసంతృప్తికి అద్దం పట్టేదిగా ఉంది.