డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులకు మళ్ళీ నోటీసులు?

తెలుగు సినీ ప్రముఖుల డ్రగ్స్ కేసుల విచారణతో ఆ కధ ముగిసిపోయినట్లేనని అందరూ భావిస్తున్నప్పటికీ అది ఇంకా ముగిసిపోలేదని ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ చెప్పడం విశేషం. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఈ కేసులో ఇంకా దర్యాప్తు, అరెస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. అవసరమైతే సినీ రంగంతో సహా ఏ రంగంలో ఉన్న వారికైనా ఈ డ్రగ్స్ వ్యవహారాలతో సంబంధాలున్నట్లు తెలిస్తే తప్పకుండా వారినీ విచారిస్తాము. దేశంలో మాదకద్రవ్యాల సరఫరా, వినియోగం చాలా బారీ స్థాయిలోనే జరుగుతోందని మాకు తెలుసు కానీ హైదరాబాద్ కు కూడా అది విస్తరించినట్లు మేము గుర్తించగానే తీగ లాగితే డొంక కదిలినట్లు చాలా విషయాలు బయటపడ్డాయి. మేము సకాలంలో గట్టి చర్యలు తీసుకోవడం వలన హైదరాబాద్ లో డ్రగ్స్ వ్యాప్తిని బాగా నియంత్రించగలిగాము. ఇదేవిధంగా ఇక ముందు అప్రమత్తంగా వ్యవహరిస్తూ డ్రగ్స్ సరఫరాదారులను పట్టుకొంటాము. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మాకు పూర్తి సహకారం అందించింది కనుకనే ఇది సాధ్యం అయ్యింది. త్వరలో కెల్విన్ ముఠాపై ఛార్జ్-షీట్లు దాఖలు చేయబోతున్నాము. ఈ డిశంబర్ నెలాఖరులోగా దర్యాప్తు పూర్తి చేసి, పూర్తి ఆధారాలు సేకరించి ఈ కేసులలో నిందితులు అందరిపై ఛార్జ్-షీట్స్ దాఖలు చేస్తాము,” అని చెప్పారు. 

కొన్ని ఉన్నత విద్యాసంస్థలలో కొందరు విద్యార్ధులు, ఐటి కంపెనీలలో కొందరు ఉద్యోగులు డ్రగ్స్ తీసుకొంటున్నట్లు గుర్తించామని, వారినీ ఆ సంస్థలను కూడా గట్టిగా హెచ్చరించామని అకున్ సబర్వాల్ తెలిపారు.