ఆ నలుగురూ తెరాస ఎంపిలు జంపింగ్?

తెరాసలో ఆ నలుగురు మాటే చెల్లుతుందనేది బహిరంగ రహస్యమే. ఆ నలుగురు ఎవరో అందరికీ తెలుసు. కనుక మొదటి నుంచి తెరాసలో ఉన్నవారు సైతం స్వేచ్చగా మాట్లాడలేని పరిస్థితి ఉన్నప్పుడు ఇక ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలేమి మాట్లాడగలరు? అని విమర్శకుల ప్రశ్న. చాలా మంది తెరాస ఎమ్మెల్యేలు, ఎంపిలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్ మెంట్ దొరకడం కష్టమనే వార్తలు కూడా వినిపిస్తుంటాయి. వాటిలో నిజానిజాలు తెరాస నేతలకే తెలియాలి. 

గత కొంతకాలంగా మీడియాలో తరచూ ఒక వార్త వినిపిస్తోంది. తెరాసకు చెందిన నలుగురు ఎంపిలు భాజపాలోకి జంప్ చేయడానికి సన్నాహాలు చేసుకొంటున్నారనేది దాని సారాంశం. వారిలో మహబూబ్ నగర్, భువనగిరి, చేవెళ్ళ, మల్కాజ్ గిరి ఎంపిలు జితేందర్ రెడ్డి, బుర్రా నర్సయ్య గౌడ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మల్లారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. ఇక తెరాస రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ తన ఇద్దరు కొడుకులతో కలిసి భాజపాలోకి జంప్ చేయడానికి సన్నాహాలు చేసుకొంటున్నట్లు వార్తలు వచ్చాయి. వారిలో శ్రీనివాస్ రెడ్డి ఒక్కరే ఆ వార్తలను ఖండించారు. 

వచ్చే నెల 17వ తేదీన తెలంగాణా విమోచన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర భాజపా నేతలు హైదరాబాద్ లో బారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు. ఆ సభకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రులు హాజరవబోతున్నారు. ఆ సభలో భాజపా పెద్దల సమక్షంలో ఇతర పార్టీలకు చెందిన కొందరు ప్రముఖ నేతలు తమ పార్టీలో చేరే అవకాశం ఉందని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. తెలంగాణాలో బలపడేందుకు ఇకపై ఇతర పార్టీల నేతలను కూడా పార్టీలోకి ఆహ్వానిస్తామని, దానిని నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామని చెప్పారు. ఆయన చెప్పిన ఈ మాటలు మీడియాలో వస్తున్న ఈ వార్తలను బలపరుస్తున్నట్లున్నాయి. అవి నిజమో కాదో సెప్టెంబర్ 17వ తేదీన ఎలాగూ తేలిపోతుంది. 

రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క కూడా కొంత మంది తెరాస మంత్రులు తమతో టచ్చులో ఉన్నారని చెప్పారు. అయితే వారు ఎవరో ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే విషయం బయటపెట్టలేదు.