తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బ్రతికి ఉన్నంతకాలం ఆమె వారసులు ఎవరూ రాలేదు. కనుకనే ఆమె స్నేహితురాలు శశికళ తాను ఆమె వారసురాలిగా ప్రకటించుకోగలిగిందని చెప్పవచ్చు. జయలలిత మృతి చెందిన తరువాత ఆమె మేనకోడలు దీపా జయకుమార్ తానే వారసురాలినని ప్రకటించుకొంది. కానీ రాజకీయ అపరిపక్వతతో ఆమె వరుసగా తప్పటడుగులు ఆమె ప్రయత్నాలు ఫలించలేదు.
ఇప్పుడు బెంగళూరుకు చెందిన అమృత అనే మహిళా తాను జయలలిత కుమార్తెనంటూ ప్రధాని నరేంద్ర మోడీకి, రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కు వ్రాసిన లేఖలను మీడియాకు అందజేసింది. ఆ లేఖలలో తాను అలనాటి అందాల నటుడు శోభన్ బాబు, జయలలితలకు జన్మించానని చెప్పుకొన్నారు. ఒకానొక్కప్పుడు జయలలిత మానసికంగా క్రుంగిపోయినప్పుడు శోభన్ బాబు ఆమెకు అండగా నిలిచాడని, ఆ తరువాత వారిరువురు దగ్గరయ్యారని, వారి ప్రేమకు గుర్తుగా తాను జన్మించానని అమృత తన లేఖలో పేర్కొంది. కానీ ఆనాటి సామాజిక కట్టుబాట్ల వలన వారిరువురూ వివాహం చేసుకోలేకపోయారని, ఆ కారణంగా తనను బెంగళూరులోని జయలలిత సోదరి శైలజ, ఆమె భర్త సారధిలకు చేతిలో పెట్టారని అమృత తెలిపారు. అయితే ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని జయలలిత తన సోదరిచేత ఒట్టు వేయించుకొన్నందున ఇంతకాలం మౌనంగా ఉండిపోయారని, కానీ జయలలిత వారసులమని చాలా మంది ముందుకు వచ్చి ఆమె ఆస్తులను కాజేయాలని ప్రయత్నిస్తున్నందున, ఇప్పుడు ఈ రహస్యం బయటపెట్టవచ్చని వారు భావించడంతో ఈ లేఖలు వ్రాసినట్లు అమృత తెలిపారు. తాను జయలలిత కుమార్తెనని నిరూపించుకొనేందుకు డిఎన్ఏ పరీక్షలకు సిద్దమని తెలిపారు. తన తల్లి మృతిపై తనకు కూడా అనుమానాలున్నాయని చెప్పారు. అధికారం కోసం శశికళ ఈ కుట్రకు పాల్పడి ఉండవచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. కనుక జయలలిత మృతిపై సిబిఐ చేత దర్యాప్తు జరిపించాలని తన లేఖల ద్వారా ప్రధానికి, రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.