దేశ ఆర్దికరాజధానిగా చెప్పబడే ముంబైలో సోమవారం రాత్రి నుంచి కురుస్తున్న బారీ వర్షాలతో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ముంబైకి జీవనాడి వంటి లోకల్ రైళ్ళు, మెట్రో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో నిత్యచైతన్యంతో ‘నిద్రపోని నగరం’గా పేరొందిన ముంబై దాదాపు స్తంభించిపోయింది.
మరో రెండు రోజులు బారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు ఎవరూ ఇళ్ళలో నుంచి బయటకు రావద్దని ప్రభుత్వమే విజ్ఞప్తి చేయవలసి వచ్చింది. ముంబై అంతా జలమయం కావడంతో స్కూళ్ళు, కాలేజీలు రెండు రోజులు శలవులు ప్రకటించాయి. ఈ బారీ వర్షాలకు ముంబై, నవీ ముంబై, థానే, శాంతాక్రజ్, అంధేరీ, కుర్లా, బైకుల్లా తదితర ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి.
మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు శాంతాక్రజ్ లో దాదాపు 9 సెంటిమీటర్లు వర్షపాతం నమోదు అయినట్లు వాతావరణశాఖ ప్రకటించింది. నిన్న రోజు మొత్తం మీద ముంబైలో 29.8 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు వాతావరణశాఖ ప్రకటించింది. దాదాపు 12 ఏళ్ళ క్రితం ముంబైలో ఈ స్థాయిలో వర్షాలు కురిసి నీట మునిగింది.
ఈరోజు ఉదయం కొద్దిగా వాన తగ్గడంతో మళ్ళీ లోకల్, మెట్రో రైళ్ళు, బస్సులు తిరగడం మొదలుపెట్టడంతో వివిధ ప్రాంతాలలో చిక్కుకు పోయినవారందరూ తమతమ ఇళ్ళకు చేరుకొనేందుకు పరుగులు తీస్తున్నారు.
ఎంతో అభివృద్ధి చెందిన మహానగరంగా పేరుపొందిన ముంబైలోనే గట్టిగా వర్షాలు పడితే ఇంత దారుణమైన పరిస్థితులు నెలకొని ఉన్నప్పుడు ముంబై కంటే ప్రాచీనమైన నగరమైన హైదరాబాద్ లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయని ఆశించలేము. అయితే హైదరాబాద్ లో అటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుకు గత మూడేళ్ళలో ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. కానీ అవి సరిపోవని ఇంకా చాలా చేయవలసి ఉందని పదేపదే నిరూపితం అవుతోంది. కనుక హైదరాబాద్ ను విశ్వనగరంగా మార్చడానికి ముందుగా నగరంలోని డ్రైనేజీ వ్యవస్థలను ఆధునీకరించడం చాలా అవసరం.