మజ్లీస్ ని తిడితే భాజపా అధికారంలోకి రాగలదా?

తెలంగాణాలో భాజపా బలం, బలహీనతలు ఏమిటో ఇతరుల కంటే బహుశః ఆ పార్టీ నేతలకే ఎక్కువ తెలిసి ఉంటాయి కనుక వాటికి అనుగుణంగా తమ ప్రణాళికలు రచించుకొని ముందుకు సాగుతారని ఆశించడం సహజమే. కానీ ఆ పార్టీ నేతలు తెరాస,మజ్లీస్ పార్టీలను ముడిపెట్టి విమర్శించితే చాలని భావిస్తున్నట్లున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మజ్లీస్ అధినేతలను మంచి చేసుకొని ముస్లిం ఓట్లను పొందడానికే తెలంగాణా విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపడం లేదని వారు ఆరోపిస్తుంటారు. అది భాజపా ఉనికిని చాటుకోవడం కోసం మాత్రమే సరిపోతుంది తప్ప రాష్ట్రంలో పార్టీ బలపడటానికి, తెరాసకు ప్రత్యామ్నయంగా ఎదగడానికి పనికిరాదని ఏమాత్రం రాజకీయ పరిజ్ఞానం లేనివారు కూడా చెప్పగలరు. 

భాజపా హిందూ మతం ఆధారంగా రాజకీయాలు చేస్తుంటే, తెరాస కూడా ఒక రాజకీయ పార్టీ కనుక, తన అధికారం నిలబెట్టుకోవాలనుకొంటుంది కనుక అది తన ముందున్న మజ్లీస్ పార్టీతో సహా అన్ని మార్గాలను ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తే తప్పు కాదు. కనుక ఈవిషయంలో భాజపా తెరాసను విమర్శించడం సరికాదనే చెప్పాలి. 

అయితే భాజపా గ్రహించవలసిన విషయం ఒకటుంది. తమ ముస్లిం వ్యతిరేకత హిందూ ఓట్లను రాల్చదనే తెలుసుకొంటే చాలా మంచిది. ఎందుకంటే దేశంలో కానీ ఏ రాష్ట్రంలోనైనా గానీ హిందూ ఓట్లన్నీ గంపగుత్తగా ఏదో ఒక పార్టీకి ఎప్పుడూ పడవు. హిందువుల ఓట్లు వివిధ పార్టీల మద్య చీలిపోతాయి. భాజపా విధానాలు, సిద్దాంతాలు నచ్చినవారు మాత్రమే దానికి ఓట్లు వేస్తుంటారు లేదా ఎన్నికల సమయంలో భాజపాకు కలిసివచ్చే ఊహించని పరిణామం ఏదైనా జరిగితే దానివైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. 

ఉదాహరణకు యూపిలో సమాజ్ వాదీ పార్టీలో ఎన్నికలకు ముందు జరిగిన కుటుంబ కలహాలు, ఆ సమయంలో వరుసగా జరిగిన అనేక తప్పులు భాజపాకు చాలా కలిసివచ్చాయి. కనుక ఆ రాష్ట్రంలో ఊహించని మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. కానీ రెండు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణాలో అటువంటి పరిస్థితులు అసలు లేవు. కనుక భాజపా నేతలు తెరాస,మజ్లీస్ పార్టీలను ముడిపెట్టి విమర్శించితే సరిపోదని గ్రహించి పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఏమి చేయాలో ఆలోచిస్తే మంచిది. 

తాజా వార్త: సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 7 వరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణా విమోచన యాత్రలు నిర్వహించబోతున్నట్లు   తెలంగాణ విమోచన కమిటీ చైర్మన్‌ వర్థన్ రెడ్డి తెలిపారు. అమరవీరుల స్థూపం నుంచి మొదలుపెడతామని చెప్పారు.