టికెట్ ఇచ్చిన పార్టీ జెండానే కూల్చివేస్తావా?

తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మళ్ళీ చాలా రోజుల తరువాత నిన్న మీడియాలో కనబడ్డారు. హైదరాబాద్ కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు టెంపుల్ జంక్షన్ వద్ద గల తెదేపా జెండా దిమ్మను పునః ప్రతిష్టించడానికి వచ్చిన సందర్భంగా రేవంత్ రెడ్డి ఒకప్పటి తన సహచరుడు, తెదేపా కూకట్ పల్లి ఎమ్మెల్యే, ప్రస్తుతం తెరాస సభ్యుడుగా ఉన్న మాధవరం కృష్ణారావుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఒకప్పుడు ఏ పార్టీ అయితే నిన్ను ఆదరించి రాజకీయంగా గుర్తింపునిచ్చి  టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా చేసిందో నేడు అదే పార్టీ జెండాదిమ్మను కూల్చి వేయడం సిగ్గుచేటు. నేరెళ్ళ ఘటనలో తెరాస నేతల ఒత్తిళ్ళకు తలొగ్గి దళితులపై దాడులు చేసినందుకు పోలీసులకు తెరాస సర్కార్ ఏ గతిపట్టించిందో అందరూ చూశారు. కనుక ఈ జెండాదిమ్మ కూల్చివేతపై పోలీసులు ధైర్యంగా దర్యప్తు జరిపి అందుకు కారకులైన తెరాస నేతలపై చర్యలు తీసుకోవాలి, అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 

“కూకట్ పల్లి ఎమ్మెల్యే కృష్ణారావును ఉద్దేశ్యించి మాట్లాడుతూ “నీ నియోజకవర్గం అభివృద్ధి కోసమే తెరాసలో చేరుతున్నానని చెప్పిన నువ్వు ఈ మూడున్నరేళ్ళలో ఏమి అభివృద్ధి చేశావో చెప్పు? ధైర్యముంటే దీనిపై బహిరంగ చర్చకు రావాలి,” అని రేవంత్ రెడ్డి సవాలు విసిరారు.