ఇదివరకు రోజుల్లో కాశీకి వెళ్ళినవారు కాటికి వెళ్ళినట్లే భావించేవారు. కానీ ఇప్పుడు రైళ్ళు, వోల్వో బస్సులలో ప్రయాణం అంటే అటువంటి భావనే కలుగుతోంది. వాటిలో ఎక్కి క్షేమంగా ఇంటికి చేరుకొంటామోలేమో చెప్పలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఈరోజు తెల్లవారుజామున మహారాష్ట్రలో దూరంతో ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. నాగపూర్ నుంచి ముంబై వెళుతున్న దూరంతో ఎక్స్ ప్రెస్ లోని 5 ఏసీ బోగీలు థానే జిల్లాలో అసంగావ్ అనే ప్రాంతంలో పట్టాలు తప్పాయి. అదృష్టవశాత్తు ఈసారి ఎవరికీ ప్రాణాపాయం కలుగలేదు కానీ కొంతమంది ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రాంతంలో కుండపోతగా వర్షం కురుస్తున్నందున సహాయ చర్యలకు ఆటంకం కలిగింది.
ఇంతకు ముందు ఉత్తరప్రదేశ్ లో రెండు రైళ్ళు పట్టాలు తప్పాయి. వాటికి నైతిక బాధ్యత వహిస్తూ రైల్వే బోర్డు చైర్మన్ ఎకె మిట్టల్ రాజీనామా చేయగా, రైల్వే మంత్రి సురేష్ ప్రభు కూడా రాజీనామాకు సిద్దపడ్డారు. కానీ ప్రధాని నరేంద్ర మోడీ అంగీకరించకపోవడంతో ఆయన ఇంకా తన పదవిలో కొనసాగుతున్నారు.
మళ్ళీ నాలుగు రోజుల క్రితం ముంబైలో ఒక ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఆ ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. ఈరోజు దూరంతో ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. పది రోజుల వ్యవధిలోనే వరుసగా నాలుగు రైళ్ళు పట్టాలు తప్పడం విశేషం. కనుక సురేష్ ప్రభు రాజీనామాను ప్రధాని నరేంద్ర మోడీ ఆమోదించే అవకాశం ఉంది. అయితే మంత్రులు, బోర్డు చైర్మన్ ల రాజీనామాలతో రైలు ప్రమాదాలు ఆగవని అందరికీ తెలుసు. కనుక వరుసగా జరుగుతున్న ఈ ప్రమాదాలకు మూలకారణాలు కనుగొని వాటి పరిష్కారం కోసం ప్రయత్నించడం చాలా అవసరం.