హర్యానాలోని డేరా సచ్చా సౌధా అధిపతి గుర్మీత్ రాం రహీం సింగ్ మహిళలపై అత్యాచారాలకు పాల్పడినట్లు రుజువవడంతో అతనికి 20 ఏళ్ళు జైలు శిక్ష పడింది. గుర్మీత్ ను ఉంచిన రోహతక్ జిల్లాలోని సునరియా జైలులోనే పంచకుల సిబిఐ కోర్టు న్యాయమూర్తి జగ్దీప్ సింగ్ ఈ తీర్పు చెప్పారు. శిక్ష ఖరారు చేసే ముందు ఇరు పక్షాల న్యాయవాదుల మద్య వాదోపవాదాలు జరుగుతున్న సమయంలో గుర్మీత్ కన్నీళ్లు పెట్టుకొని తను సమాజానికి సేవలను దృష్టిలో ఉంచుకొని తక్కువ శిక్ష వెయవలసిందిగా న్యాయమూర్తిని బ్రతిమాలుకొన్నాడు. కానీ అతను చేసిన తీవ్ర నేరాలకు కనీసం 20 ఏళ్ళు జైలు శిక్ష విధించడమే సరైనదనే సిబిఐ న్యాయవాది వాదనలతో ఏకీభవిస్తూ జగ్దీప్ సింగ్ ఈ తీర్పు చెప్పారు.
సిబిఐ కోర్టు తీర్పును రేపు పంజాబ్-హర్యానా ఉమ్మడి హైకోర్టులో సవాలు చేయడానికి అతని లాయర్లు సిద్దమవుతున్నారు.
తీర్పు ఈవిధంగా రావచ్చని ఊహిస్తున్నదే కనుక హర్యానాలో సమస్యాత్మక ప్రాంతాలలో బారీగా పారామిలటరీ దళాలను మొహరించి ఉంచడంతో ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి.