భారత ప్రధానన్యాయమూర్తిగా దీపక్ మిశ్రా ప్రమాణస్వీకారం

భారతదేశ 45వ ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ)గా జస్టిస్ దీపక్ మిశ్రా సోమవారం ఉదయం రాష్ట్రపతి భవన్ లో ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు తదితరులు హాజరయ్యారు. 

సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంగనాథ్ మిశ్రా మేనల్లుడు దీపక్ మిశ్రా. ఆయన 1977లో ఓడిశాలో న్యాయవాదిగా మొదలుపెట్టి 1996లో ఓడిశా హైకోర్టు అడిషనల్ జడ్జ్ గా, 2009లో పాట్నా (బిహార్) హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2010లో డిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా, 2011లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. నేడు న్యాయవ్యవస్థలో అత్యున్నతమైన ప్రధాన న్యాయమూర్తి పదవిని చేపట్టారు. ఆయన ఈ పదవిలో 14 నెలలపాటు అంటే వచ్చే ఏడాది అక్టోబర్ వరకు కొనసాగుతారు.