రైతు సంఘాల ఏర్పాటు విధివిధానాలు ఖరారు

ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధి కోసం చేపడుతున్న అనేక చర్యలలో భాగంగా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రైతు సంఘాలను ఏర్పాటు చేయాలని నిశ్చయించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి వాటి ఏర్పాటుకు విధివిధానాలను నిన్న మీడియాకు తెలియజేశారు.

హైదరాబాద్ లో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ రాష్ట్రంలో మొత్తం 10,800 రెవెన్యూ గ్రామాలున్నాయి. వాటిని 3,600 యూనిట్లుగా విభజించి వచ్చేనెల 1వ తేదీ నుంచి 9 వరకు రైతు సంఘాలు ఏర్పాటు చేస్తాము. సెప్టెంబర్ 10 నుంచి 14 వరకు మండల స్థాయి రైతు సమన్వయ సంఘాలు ఏర్పాటు చేస్తాము. ఆ తరువాత జిల్లా, రాష్ట్రా స్థాయి రైతు సమన్వయ సంఘాలు ఏర్పాటు చేస్తాము. వీటిలో గ్రామస్థాయి రైతు సంఘంలో 15 మంది రైతులు, మండల, జిల్లా స్థాయి సంఘాలో 24 మంచి చొప్పున, రాష్ట్ర స్థాయి సంఘంలో 42 మంది రైతులు సభ్యులుగా ఉంటారు.  ఆ రైతు సంఘాల సహకారంతో సెప్టెంబర్ 15వ తేదీ నుంచి ఈ ఏడాది డిశంబర్ 15 వరకు రాష్ట్రంలో సమగ్రభూసర్వేను నిర్వహించి, రైతుల భూరికార్డులలో ఉన్న లోపాలను సరిచేస్తాము. ఆ రికార్డుల ఆధారంగా, త్వరలో ఏర్పాటు చేయబోతున్న రైతు సంఘాల ద్వారా వచ్చే ఏడాది మే15వ తేదీలోగా రాష్ట్రంలో రైతులందరికీ ఎకరానికి రూ.4,000 చొప్పున రెండు పంటలకు కలిపి రూ.8,000 అందిస్తాము. ఆ డబ్బును నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలలోకే జమా చేస్తాము కనుక రైతులు దాని కోసం అధికారుల చుట్టూ తిరుగవలసిన అవసరం లేదు. మేము చేపట్టిన ఈ పనులన్నీ అమలవడం మొదలైతే రాష్ట్రంలో వ్యవసాయం, దానిపై ఆధారపడిన రైతన్నల పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి,” అని అన్నారు.