నంద్యాల ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు షురూ

కర్నూలు జిల్లా నంద్యాల ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు కొద్దిసేపటి క్రితమే నంద్యాల ప్రభుత్వం పాలిటెక్నిక్ కళాశాలలో మొదలైంది. మొత్తం 19 రౌండ్లలో ఈ లెక్కింపు జరుగుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ పేపర్లను లెక్కించగా వాటిలో వచ్చిన 39 ఓట్లు చెల్లలేదు. మొదటి రౌండ్ లెక్కింపులో తెదేపా అభ్యర్ధి భూమా బ్రహ్మానందరెడ్డి 1198 ఓట్ల ఆధిఖ్యత సాధించారు. తెదేపాకు 5,477, వైకాపా అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డికి 4,279 కాంగ్రెస్ అభ్యర్ధి అబ్దుల్ ఖాదర్ కు కేవలం 69 ఓట్లు మాత్రమే పడ్డాయి. 

నిజానికి ఈ ఉపఎన్నికలకు ఎటువంటి ప్రాధాన్యతలేకపోయినప్పటికీ వీటిని తెదేపా పాలనకు రిఫరెండంగా, వచ్చే ఎన్నికలకు సెమీ ఫైనల్స్ గా వైకాపా గట్టిగా ప్రచారం చేయడంతో తెదేపా కూడా వీటిని జీవన్మరణ సమస్య అన్నట్లు పోరాడింది. అందుకే ఈ ఉపఎన్నికలు ఆ రెండు పార్టీల అభ్యర్ధుల మద్య జరుగుతున్నట్లు కాక చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డిల మద్య జరుగుతున్న ప్రత్యక్ష ఎన్నికలన్నట్లు జరిగాయి. కనుక ఈ ఉపఎన్నికల ఫలితాలపై రెండు తెలుగు రాష్ట్రాలలో ఉత్కంట నెలకొని ఉంది.

ఆ కారణంగానే ఎన్నికల ఫలితాలపై చాలా బారీ స్థాయిలో బెట్టింగులు జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలలో చాలా బారీ స్థాయిలో బెట్టింగులు జరిగినట్లు సమాచారం. మద్యాహ్నం 11-12 గంటలలోగా అంతిమ ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.