ఆ బాబా నల్లగొండలో కూడా డేరా వేశాడు!

పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో ఇంతకాలం సమాంతర పరిపాలన సాగిస్తున్న డేరా సచ్చా సౌధా (ఆశ్రమం) అధినేత గుర్మీత్ రాం రహీం సింగ్ తన సామ్రాజ్యాన్ని దక్షిణాదికి కూడా విస్తరించడానికి చాలా కాలం క్రితమే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు అతనిని మొన్న అరెస్ట్ చేసిన తరువాత బయటపడింది. 

తెలంగాణాకు చెందిన కొందరు రియాల్టర్లు కొన్ని నెలల క్రితం నల్లగొండ జిల్లాలో చిట్యాల మండలంలో వెలిమినేడులో 56 ఎకరాలు కొని దానిని డేరా సౌధా పేరిట బదలాయించారు. ఆ భూమి హైవేకు ఆనుకొని ఉంది. దాని చుట్టూ ప్రహారీ గోడ నిర్మించి, ప్రధాన ద్వారానికి ఇరువైపులా గుర్మీత్ రాం రహీం సింగ్ ఫోటోలతో కూడిన డేరా సచ్చా సౌధా బోర్డులు ఏర్పాటు చేశారు. అయితే దానిలో 9 ఎకరాలు అసైన్డ్ భూమి కూడా ఉంది. చట్ట ప్రకారం అసైన్డ్ భూముల అమ్మకాలు, కొనుగోలు చేయడానికి వీలులేనప్పటికీ రియాల్టర్లు కోర్టు నుంచి తాత్కాలిక అనుమతి తీసుకొని ఆ భూమిని కూడా కలిపేసి దాని చుట్టూ ప్రహారీ గోడ నిర్మించేసి డేరా సౌధాకు దానిని అప్పగించేశారు. 

అత్యాచారం కేసులో గుర్మీత్ ను పోలీసులు అరెస్ట్ చేయడం, ఆ సందర్భంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో విద్వంసం జరగడంతో ఆ నష్టాన్ని భర్తీ చేసుకొనేందుకు డేరా సౌధా ఆస్తులను స్వాధీనం చేసుకోవలసిందిగా ఆ రెండు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హర్యానాలో జరిగిన ఈ పరిణామాలతో తెలంగాణా ప్రభుత్వం కూడా మేల్కొని నల్లగొండలోని డేరా సౌధా భూములను స్వాధీనం చేసుకోవడానికి సిద్దం అవుతోంది.

 తహసిల్దార్ విజయలక్ష్మి అధ్వర్యంలో రెవెన్యూ అధికారులు నిన్న  క్షేత్రస్థాయిలో పర్యటించి, ప్రభుత్వ రికార్డుల ప్రకారం వెలిమినేడు డేరా సౌధాలో 9 ఎకరాలు అసైన్డ్ భూములున్నట్లు నిర్ధారించారు. త్వరలో వాటిని స్వాధీనం చేసుకోవడానికి అవసరమైన కసరత్తు మొదలుపెట్టారు.