ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి ఈరోజు విజయవాడలో ఏపి సర్కార్ పౌర సన్మానం చేసింది. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘నేను ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని రెండు కోర్కెలు కోరుతున్నాను. ఒకటి పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తో సఖ్యతగా ఉంటూ ఇచ్చిపుచ్చుకొనే ధోరణిలో వ్యవహరించాలి. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా ఇదే కోరిక కోరాను. చంద్రబాబు నాయుడుని అదే కోరాను. అందుకు ఇరువురు ముఖ్యమంత్రులు అంగీకరించారు. చాలా సంతోషం. కుటుంబ సభ్యుల మద్య కూడా అనేక అభిప్రాయబేధాలు ఉంటాయి. కానీ అంతమాత్రాన్న ఎవరూ రక్తసంబంధాలను తెంచుకోరు కదా? ఇది కూడా అంతే. కనుక ముఖ్యమంత్రులు ఇద్దరూ పరస్పరం సహకరించుకొంటూ యావత్ దేశప్రజల చేత మన తెలుగురాష్ట్రాలు దేశంలోనే నెంబర్ :1 రాష్ట్రాలుగా అభివృద్ధి చెందాయని చెప్పుకొనేలా చేయాలి. మన తెలుగువారు గర్వపడేలా చేయాలి. ఇదే నా మొదటి కోరిక,” అని అన్నారు.
“ఇక నా రెండవ కోరిక ఏమిటంటే తెలుగు బాషను పరిపాలనా బాషగా ఏర్పాటు చేయాలి. నేను ఉపరాష్ట్రపతినైన తరువాత చాలా మంది నన్ను నా డ్రెస్ (పంచెకట్టు) మార్చుకొబోతున్నారా లేదా? అని అడిగేవారు. వారికి నేను “నా అడ్డ్రస్ మారుతుంది కానీ డ్రెస్ మారదని” చెప్పేవాడిని. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మనం మన కన్నతల్లిని, మాతృభూమిని, మాతృబాషను ఎన్నడూ మరిచిపోకూడదు. ఎన్నడూ నిర్లక్ష్యం చేయకూడదు. కనుక నేను కోరుకొంటున్నది ఏమిటంటే అందరూ తెలుగులోనే మాట్లాడాలి...తెలుగులోనే పాలించుకోవాలి. పాలకులు తలచుకొంటే తెలుగు బాషను పరిపాలనా బాషగా అమలుచేయడం కష్టమైనా పనేమీ కాదని నా నమ్మకం,” అని వెంకయ్య నాయుడు అన్నారు. ఆయన రెండు కోర్కెలు సముచితమైనవే కదా!