ఏపి సర్కార్ లో మంత్రి పరిటాల సునీత, దివంగత తెదేపా నేత పరిటాల రవి దంపతుల కుమారుడు పరిటాల శ్రీరాంకు అక్టోబర్ 1న వివాహం జరుగబోతోంది. పెళ్ళికూతురు పేరు ఆలం జ్ఞాన. ఆమె అనంతపురం జిల్లాకే చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ కుమార్తె. మంత్రి పరిటాల సునీత నిన్న శుక్రవారం తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెంకన్న దర్శనం చేసుకొని ఆచారం ప్రకారం మొట్టమొదటి శుభలేఖను దేవునికి సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈరోజు ఉదయం ఆమె తన బందువులతో కలిసి ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్ళి ఆహ్వాన పత్రిక అందించి తన కుమారుడి వివాహానికి ఆహ్వానించారు. అనంతరం వారు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, తెదేపా నేతలకు కూడా శుభలేఖలు ఇచ్చి ఆహ్వానిస్తున్నారు. త్వరలో వారు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, తెరాస మంత్రులను కూడా పరిటాల శ్రీరాం వివాహానికి ఆహ్వానించడానికి హైదరాబాద్ రాబోతున్నట్లు సమాచారం.