ఎవరైనా ప్రముఖులను లేదా ఆత్మీయులను సన్మానించదలచుకొనేవారు దాని గురించి అందరికీ తెలియబరిచేందుకు మీడియాలో ప్రకటనలు ఇవ్వడం, తరువాత అందరి సమక్షంలో యధాశాక్తిన సన్మానం చేయడం సాధారణవిషయమే. తెలుగువాడైన వెంకయ్య నాయుడు అత్యున్నతమైన ఉపరాష్ట్రపతి పదవి చేప్పట్టడం అందరికీ సంతోషం కలిగించే విషయమే కనుక ఆయనను తెలంగాణా ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనంగా సన్మానించారు. ఈరోజు ఆయనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సన్మానించబోతోంది. ఉపరాష్ట్రపతిగా పదవి చేపట్టిన తరువాత మొట్టమొదటిసారిగా స్వరాష్ట్రానికి వస్తున్నారు కనుక ఆయనను సన్మానించడం తప్పుకాదు. కానీ ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆయన విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయంలో దిగినప్పుడు ఆయనకు స్వాగతం పలికేందుకు తెదేపా సర్కార్ చేసిన హడావుడిని చూసి అందరూ ముక్కున వేలేసుకొన్నారు.
గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు
నాయుడు, రాష్ట్ర మంత్రులు ఆయనకు విమానాశ్ర్రయంలో ఘన స్వాగతం పలికిన తరువాత ఆయనను ప్రత్యేక
వాహనంలో ఊరేగింపుగా విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద సన్మానం జరిగే ప్రదేశానికి తీసుకువెళ్ళారు.
విశేషమేమిటంటే ఆ స్వాగత ర్యాలీలో ఏకంగా లక్ష మంది పాల్గొన్నారు. ఆ కారణంగా గన్నవరం
నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు 23 కిమీల పొడవునా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవడంతో ఉద్యోగాలు,
వ్యాపారాలకు వెళ్ళేవారు చాలా ఇబ్బంది పడ్డారు. ఆ సన్మానం జరిగేవరకు లక్ష మంది
అక్కడే ఉండే అవకాశం ఉంది అది పూర్తయ్యేవరకు ఆ పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్
స్తంభించిపోక తప్పదు.
వెంకయ్య నాయుడుకు ప్రభుత్వం సన్మానం చేయడం
కోసం ఇంత ఆర్భాటం, హంగామా చేయడం ఎందుకు? ప్రజలను ఇబ్బంది పెట్టడం ఎందుకు? అని
ప్రశ్న. ఈ బలప్రదర్శన, ఆర్భాటం చూస్తుంటే వెంకయ్య నాయుడుకు సన్మానం చేస్తున్నారా
లేక చంద్రబాబు తనకు తాను ప్రచారం చేసుకొంటున్నారా? అనే అనుమానాలు వ్యక్తం
అవుతున్నాయి. ఈ అనవసరపు ఆర్భాటాలను చూసే కేంద్రప్రభుత్వం ఏపి
సర్కార్ కు నిధులు విదిలించడం లేదని రాష్ట్ర భాజపా నేతలు సన్నాయి నొక్కులు
నొక్కుతున్నా చంద్రబాబు వాటిని చెవికెక్కించుకోకపోవడం విశేషం.