ఆయన వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదు: భాజపా

డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్ రామ్ రహీం సింగ్ ను అత్యాచారం కేసులో హర్యానాలోని పంచకుల ప్రత్యేక సిబిఐ  కోర్టు నిన్న దోషిగా ప్రకటించడంతో దేశ రాజధాని న్యూడిల్లీతో సహా పంజాబ్, హర్యానా, యూపి, రాజస్తాన్ రాష్ట్రాలలో గుర్మీత్ భక్తులు హింసాకాండకు పాల్పడుతున్నారు. నిన్న ఒక్కరోజే ఘర్షణలలో 31 మంది చనిపోగా సుమారు 300 మందికిపైగా గాయపడ్డారు. ఆందోళనకారులు నిన్న ఒక్కరోజునే వందలకోట్ల విలువగల ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు నిప్పుపెట్టారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు ఇతర రాష్ట్రాల నుంచి బస్సులు, రైళ్ళ రాకపోకలు నిలిచిపోయాయి. దాని వలన వందల కోట్లు నష్టం వస్తోంది. ఈ నెల 28వ తేదీన పంచకుల సిబిఐ కోర్టు డేరా బాబాకు శిక్ష ఖరారు చేయనుంది. కనుక ఆరోజున ఇంకా బారీ స్థాయిలో హింసాకాండ జరిగే ప్రమాదం కనబడుతోంది. 

ఉత్తర భారతాన్ని వణికిస్తున్న ఈ అల్లర్లను ఏవిధంగా నియంత్రించాలా..అని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తుంటే, భాజపా ఎంపి సాక్షి మహారాజ్ కోర్టు తీర్పుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

“ఎవరో ఒకరిద్దరు అనామక మహిళలు చేసిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకొని పంచకుల కోర్టు డేరా బాబాను దోషిగా ప్రకటించి చాలా తప్పు చేసింది. కోర్టు తీర్పు కోట్లాది హిందువుల మనోభావాలను దెబ్బ తీసింది. అందుకే వారు తమ ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు,” అని అన్నారు.

ఆయన వ్యాఖ్యలపై భాజపా వెంటనే స్పందించింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి కైలాస్ విజయ్ వర్గీయ డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “కైలాష్ మహారాజ్ చేసిన వ్యాఖ్యలతో భాజపాకు ఎటువంటి సంబంధమూ లేదు. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. పంజాబ్, హర్యానాలో జరుగుతున్న అల్లర్లను అదుపుచేయడానికి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకొంటున్నాయి,” అని చెప్పారు. 

ఇద్దరు మహిళలపై అత్యాచారం చేసిన డేరా బాబాను దోషిగా కోర్టు ప్రకటిస్తే, ఒక ఎంపిగా ఉన్న సాక్షి మహారాజ్ కోర్టు తీర్పును స్వాగతించకపోగా అత్యాచారానికి గురైన మహిళలు అనామకులు కనుక వారి ఆరోపణలు పట్టించుకోనవసరం లేదన్నట్లు మాట్లాడటం చాలా బాధాకరం. పైగా డేరా బాబా అనుచరులు ఇంత విద్వంసం సృష్టిస్తుంటే వారిని వెనకేసుకువస్తూ మాట్లాడటం ఇంకా దారుణం. ఇటువంటి వారిని ప్రజలు చట్టసభలకు పంపించడమే తప్పు. ఈవిధంగా మాట్లాడుతున్నప్పటికీ వారిని పార్టీలో సభ్యుడిగా కొనసాగనీయడం ఇంకా తప్పు.