బతుకమ్మ చీరల పంపిణీకి ముహూర్తం ఖరారు

తెలంగాణాలో దయనీయమైన జీవితాలు గడుపుతున్న చేనేత, మరమగ్గాల కార్మికులకు చేతినిండా పని, ఆదాయం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వారికి బతుకమ్మ చీరలను నేసే బాధ్యతను అప్పగించిన సంగతి తెలిసిందే. బతుకమ్మ పండుగ ప్రధానంగా మహిళలు నిర్వహించే పండుగ. కనుక ప్రభుత్వం తరపున తెలంగాణాలో 1,04,57,610 మందికి పేద మహిళలకు ఈ బతుకమ్మ చీరలు అందించబోతోంది. తద్వారా అటు నేతన్నలకు, ఇటు మహిళలకు కూడా సహాయపడినట్లు అవుతోంది. 

ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న సబంధిత అధికారులతో ప్రగతి భవన్ లో సమావేశమయ్యి బతుకమ్మ చీరల పంపిణీ గురించి చర్చించారు. సెప్టెంబర్ 18 నుంచి 20 వరకు రేషన్ షాపుల ద్వారా అన్ని కులాలు, మతాల మహిళలకు ఈ చీరలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. 18 ఏళ్ళు నిండిన యువతులకు కూడా ఈ బతుకమ్మ చీరలు అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ చీరల పంపిణీ కార్యక్రమం బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించారు.