రాష్ట్ర ప్రభుత్వం కోటి ఎకరాలకు నీళ్ళు పారించేందుకు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం మొదలుపెడితే, భూసేకరణను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు కోర్టులకు వెళుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో భూసర్వే నిర్వహించడానికి ప్రభుత్వం సిద్దం అవుతుంటే దానికీ ప్రతిపక్షాలు అప్పుడే అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.
దీనిపై మొదటగా తెదేపా స్పందించింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ నిన్న ఎన్టీర్ ట్రస్ట్ భవన్ లో పార్టీ నేతలతో సమావేశమై ఈ అంశంపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకొంటోందని వారు ఆరోపించారు. ఈ విషయం గురించి శాసనసభకు, ప్రతిపక్షాలకు తెలియజేయకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు. ముందుగా ముఖ్యమంత్రి కేసీఆర్ అఖిలపక్ష సమావేశం నిర్వహించి ఈ విషయాన్ని ప్రతిపక్షాలకు తెలియజేసి వారి అభిప్రాయాలు తెలుసుకొన్నాక తరువాత శాసనసభలో కూడా దీనిపై చర్చించి సభ ఆమోదంతో సర్వే మొదలుపెట్టి ఉంటే బాగుండేదని తెదేపా నేతలు అభిప్రాయపడ్డారు. త్వరలోనే అన్ని పార్టీలను కలుపుకొని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సమావేశంలో నిర్ణయించుకొన్నారు.
ఇక సిపిఎం నేతలు కూడా ఇంచుమించు ఇటువంటి అభిప్రాయాలే వ్యక్తం చేశారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఎమ్మెల్యే సున్నం రాజయ్య తదితరులు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ, “ప్రభుత్వం చేపట్టబోయే భూసర్వే గురించి ఎంతఃసేపు గొప్పలు చెప్పుకోవడమే తప్ప ఇంతవరకు దాని విధివిధానాలను రూపొందించలేదు. ప్రతిపక్షాలకు కనీసం నామమాత్రంగానైనా తెలియజేయకుండా ముందుకు సాగడానికి సిద్దం ఆవుతోంది. సమగ్ర భూసర్వేను మేము స్వాగతిస్తున్నాము అయితే ప్రభుత్వం ముందుకు సాగుతున్న విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. ప్రతిపక్షాలను, రైతులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము,” అని అన్నారు.