రాష్ట్ర విభజన జరిగి మూడున్నరేళ్ళు కావస్తోంది అయినా ఆర్టీసి విభజన ప్రక్రియ ఇంతవరకు పూర్తికాలేదు. దాని కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్ర కమిటీ నేతృత్వంలో విజయవాడలోని ఆర్టీసి హౌస్ లో ఇరు రాష్ట్రాల ఆర్టీసి అధికారులు గురువారం మళ్ళీ మరోమారు సమావేశమయ్యారు. గతంతో పోలిస్తే ఈ సమావేశం చాలా సానుకూలంగానే సాగినట్లు చెప్పవచ్చు. ఈ సమావేశంలో ఇరు పక్షాలు అంగీకారానికి వచ్చిన అంశాలు ఇవే:
1. 2015, జూన్ 1 నాటికి ఇరు రాష్ట్రాల ఆర్టీసిలో ఉన్న ఖాళీలు, ఉద్యోగుల స్థానికత ఆధారంగా బదిలీలకు అంగీకారం కుదిరింది.
2. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి 14 నెలల వ్యవధిలో ఆర్టీసి ఆదాయంపై ఆడిట్ నిర్వహించి, దానిని 58:42 నిష్పత్తిలో ఏపి, తెలంగాణా ఆర్టీసిలు పంచుకోవడానికి అంగీకరించాయి.
ప్రతిష్టంభన ఏర్పడిన అంశాలు:
1. హైదరాబాద్ లో ఆర్టీసికి చెందిన స్థిరాస్తులలో వాటా ఇవ్వాలని ఏపి ఆర్టీసీ కోరుతుండగా, ఏ రాష్ట్రంలో ఉన్న ఆస్తులు ఆ రాష్ట్రానికే చెందుతాయని టి.ఎస్.ఆర్.టి.సి.వాదిస్తోంది. అయితే హైదరాబాద్ లోని బహుశః భవన్ మాత్రం ఇవ్వడానికి అంగీకరించినట్లు సమాచారం.
తెలంగాణాలో ఏపి.ఎస్.ఆర్టీసి. ఎన్ని కిమీ బస్సులు నడిపిస్తోందో, తమ బస్సులు కూడా ఏపిలో అన్ని కిమీ నడుపుకొనేందుకు అనుమతించాలని టి.ఎస్.ఆర్.టి.సి.అధికారులు కోరారు. దీనిపై ప్రభుత్వాన్ని సంప్రదించి సమాధానం చెపుతామని ఏపి.ఎస్.ఆర్.టి.సి. అధికారులు చెప్పినట్లు సమాచారం. మళ్ళీ సెప్టెంబర్ 15వ తేదీన సమావేశం అవ్వాలని ఉభాయరాష్ట్రాల అధికారులు నిర్ణయించారు.
ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ఆర్.టి.సి.ఎండిలు, ఈడిలు, రవాణాశాఖ ముఖ్యకార్యదర్శులు, కేంద్ర కమిటీ సభ్యులు,జి.హెచ్.ఎం.సి.కమీషనర్ జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.