తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కు అగ్రికల్చర్ లీడర్ షిప్ అవార్డు-2017 లభించిన సంగతి తెలిసిందే. ఆయన కుమార్తె, నిజామాబాద్ ఎంపి కవితకు కూడా ప్రతిష్టాత్మకమైన అవార్డు లభించింది. దేశంలో వివిద రంగాలలో విశేష కృషి చేస్తున్న మహిళలకు కేంద్రప్రభుత్వం ఈ ఏడాది నుంచి ‘నారీ ప్రతిభా పురస్కార్’ (అవార్డు) లను ఇవ్వడం మొదలుపెట్టింది.
కవితక్క నేతృత్వంలో నడుస్తున్న తెలంగాణా జాగృతి సంస్థ అధ్వర్యంలో తెలంగాణా యువతులకు ఉద్యోగ, ఉపాధి కల్పనకు అవసరమైన శిక్షణను అందిస్తున్నందుకు విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ అసోసియేషన్ మరియు కేంద్ర మంత్రిత్వశాఖ మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ఎం.ఎస్.ఎం.ఈ.) 2017సంవత్సరానికి గాను కవితక్కకు ఈ అవార్డును ప్రకటించాయి.
ఆమెతో బాటు రాష్ట్రంలో మహిళలకు రక్షణగా నిలుస్తున్నందుకు పోలీస్ శాఖలో ‘షీ టీమ్స్’ కు నేతృత్వం వహిస్తున్న స్వాతి లక్రా కూడా ఈ అవార్డును అందుకొన్నారు. కల్పకం ఏచూరి, ఆషా ప్రకాశ, స్మృతి నాగపాల్, ప్రియా భార్గవ, షిర్లే అబ్రహంలు కూడా ఈ అవార్డులు అందుకొన్నారు. విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ అసోసియేషన్ ఇండియా చైర్‌పర్సన్ డాక్టర్ టి.వసంతలక్ష్మి నిన్న హైదరాబాద్ లో ఈ అవార్డును దానితో పాటు ప్రశంసాపత్రాలను వారికి అందజేశారు.