కాంగ్రెస్ నేతలకు తెరాస చురకలు

ముఖ్యమంత్రి కేసీఆర్ కు అగ్రికల్చర్ లీడర్ షిప్ అవార్డు-2017 ప్రకటించడంపై రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేయడం, విమర్శలు, ఆరోపణలు గుప్పించడంపై తెరాస ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. “కాంగ్రెస్ హయాంలో నిరుపయోగమైన అనేక ప్రాజెక్టులు కట్టి ప్రజాధనం వృధా చేయడం తప్ప చేసింది ఏమిటి? వాటిని మళ్ళీ వినియోగంలోకి తెచ్చేందుకు మా ప్రభుత్వం చేస్తున్న కృషిని గుర్తించకుండా తిరిగి మాపైనే ఆరోపణలు చేస్తున్నారు టి కాంగ్రెస్ నేతలు. తెలంగాణా రాష్ట్రం మేమే ఇచ్చామని గొప్పలు చెప్పుకొంటున్న కాంగ్రెస్ నేతలు చేస్తున్నదేమిటి? ప్రాజెక్టు పనులు ముందుకు సాగనీయకుండా కోర్టులలో కేసులు వేసి అడ్డుపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రగతి నిరోధక పార్టీ. వారికి తమ రాజకీయ ప్రయోజనాలు తప్ప రాష్ట్రాభివృద్ధి పట్టదు. వచ్చే ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రావాలని పగటికలలు కంటున్న కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు నానాటికీ పెరుగుతున్న ప్రజాధారణ, పేరు ప్రతిష్టలను చూసి ఓర్వలేకనే విమర్శలు చేస్తున్నారు. అభివృద్ధికి అడ్డుపడుతున్నారు. ప్రజలే వారికి తగిన విధంగా బుద్ధి చెపుతారు,” అని అన్నారు.